ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక సమీకరణాలు, కులాలవారీగా ప్రజల లెక్క తేల్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పేదలు, అట్టడుగు వర్గాల ప్రజలను పైకి తీసుకురావడమే టార్గెట్‌గా పెట్టుకుంది. అందుకే సమగ్ర కులగణన అంటుంది ఏపీ సర్కార్. 92 ఏళ్ల తర్వాత చేపడుతున్న కులగణనతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కులాల లెక్క తేలుస్తామంటుంది. రాష్ట్రంలో సమగ్ర కులగణనకు ఇటీవల కేబినెట్ ఆమోదముద్ర వేసింది. స్వాతంత్రం రాకముందు ప్రతి పదేళ్లకోసారి కులగణన జరిగేది. 1911, 1921, 1931లోనూ కులగణన జరిగింది. 1941లో కూడా కులగణన ప్రారంభించినప్పటికీ ప్రపంచయుద్దం కారణంగా మధ్యలోనే నిలిచిపోయింది. దీంతో 1931లో జరిగిన కులగణన చివరిది.
అయితే ఏ కులం ఎంతమంది ఉన్నారనేది నోటిమాటగా చెప్పుకోవడం తప్ప సరైన గణాంకాలు ప్రస్తుతం ప్రభుత్వం వద్ద లేవు. దేశంలో ఇటీవల బిహార్ ప్రభుత్వం కులగణన చేపట్టింది. ఏపీలో కూడా సమగ్ర కులగణన ద్వారా పేదలు, అట్టడుగు, బలహీన వర్గాల ఉపాధి, ఆదాయం, విద్య, ఇలా అన్ని రంగాల్లో వారి స్థితిగతులను అంచనా వేసేలా సర్వే చేపట్టనుంది ప్రభుత్వం. ఇప్పటికే సంక్షేమ పథకాల ద్వారా అన్ని వర్గాలను ఆర్ధికంగా పైకి తీసుకొచ్చేలా ప్రభుత్వం ముందుకెళ్తుంది. తాజాగా సమగ్ర కులగణన ద్వారా మరింత పటిష్టంగా పథకాలు అమలుచేస్తామని చెప్పుకొస్తుంది సర్కార్.
సమగ్ర కులగణన కోసం ఎనిమిది నెలలుగా ప్రభుత్వం అధ్యయనం చేసింది. దీనికోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ప్రణాళిక, సచివాలయాల శాఖల ముఖ్యకార్యదర్శులతో కమిటీ వేసింది ప్రభుత్వం. ఆరుగురు అధికారుల కమిటీ దేశంలో కులగణన చేపట్టిన రాష్ట్రాల్లో పర్యటించింది. అక్కడ న్యాయపరంగా వస్తున్న ఇబ్బందులను కూడా పరిశీలించింది. కులగణన ఎలా చేపట్టాలి. ఎలాంటి డేటా తీసుకోవాలి వంటి అంశాలతో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దీని ప్రకారం రాష్ట్రంలో ఉన్న సుమారు కోటీ 60 లక్షల కుటుంబాలను సర్వే చేయనుంది ప్రభుత్వం. గ్రామ,వార్డు సచివాలయాల సిబ్బంది, వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ వెళ్లి సమాచారం సేకరించనుంది. ఎప్పుడెప్పుడు ఏం చేయలన్నదానిపై విధివిధానాలు జారీ చేసింది ప్రభుత్వం.
రాష్ట్రంలో చేపట్టనున్న సమగ్ర కుల గణన కు సంబందించిన విధివిధానాలను సాంఘిక సంక్షేమ శాఖ విడుదల చేసింది. ఎప్పుడెప్పుడు ఎలాంటి కార్యక్రమాలు చేయాలి. రీజినల్ మీటింగ్‌లు, కుల సంఘాలతో మీటింగ్‌లు ఎప్పుడు నిర్వహించాలి. పైలెట్ ప్రాజెక్టుపై పూర్తి షెడ్యూల్ ఇచ్చారు. కులగణన ప్రక్రియ మొత్తం గ్రామ, వార్డు వాలంటీర్లు-సచివాలయ సిబ్బంది ద్వారా జరగనుంది. దీనికోసం ప్రత్యేకంగా యాప్ కూడా తీసుకొచ్చారు. ఇంటింటికీ వెళ్లి తీసుకునే సమాచారం యాప్‌లోనే డిజిటల్ విధానంలో అప్ లోడ్ చేయాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..