BJP Mahila Morcha President fires on AP Govt.రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సీతానగరం అత్యాచార బాధితురాలికి ప్రభుత్వం చెల్లని చెక్కు ఇచ్చి మోసం చేసిందని భారతీయ జనతా మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు బొల్లినేని నిర్మలా కిషోర్ ఆరోపించారు. అత్యాచారం కేసులో నిందితులను ఇంతవరకు పట్టుకోలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి అతి సమీపంలో జరిగిన ఘటనలో ప్రభుత్వ అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని ఆమె విమర్శించారు.
రాష్ట్రానికి మహిళా హెూం మంత్రి ఉన్నా మహిళలకు రక్షణ కరువైందన్నారు. ఆడవారిపై వరుసగా అత్యాచార ఘటనలు జరుగుతుండటం పోలీసుల అసమర్థతకు నిదర్శనమన్నారు. తాజాగా తాడేపల్లిలో ప్రేమించలేదని ఒక అమాయకురాలిని హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చిందని ఆమె తెలిపారు. ఈ ప్రభుత్వ హయాంలో 455 అత్యాచార ఘటనలు జరిగినా వాటిని అరికట్టేందుకు ప్రయత్నించడం లేదని నిర్మలా ఆరోపించారు. ఇప్పటివరకు ఎన్ని కేసులు పరిష్కరించారో చెప్పాలని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితురాలికి చెల్లని చెక్కునిచ్చి ప్రభుత్వం కూడా మోసం చేసిందని నిర్మలా కిషోర్ ధ్వజమెత్తారు.