AB Venkateswara Rao: ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ఇష్యూపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనపై మోపిన అభియోగాలపై విచారణ జరిపేందుకు విచారణాధికారిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ఆర్పీ సిసోడియాను విచారణాధికారిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆదేశాలు జారీ చేశారు. అఖిల భారత సర్వీసు క్రమశిక్షణా నిబంధనల్లోని సెక్షన్ 8 కింద నమోదైన అభియోగాలపై ఆర్పీ సిసోడియా విచారణ జరుపనున్నారు. కాగా, విచారణాధికారి ముందు అభియోగాలపై ప్రభుత్వం తరఫున వాదించేందుకు అడ్వకేట్‌ను కూడా నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు సెక్షన్ 8 కింద నమోదైన అభియోగాలకు సంబంధించి వివరణను నిర్ణీత సమయంలోగా సమర్పించాలంటూ ఏబీ వెంకటేశ్వరరావును ప్రభుత్వం ఆదేశించింది.
కాగా, నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఇంటెలెజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అయితే, ఈ కేసులో కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ముందు విచారణకు హాజరైన వెంకటేశ్వరరావు.. సర్వీస్ రూల్స్‌కు విరుద్ధంగా విచారణకు సంబంధించిన అనేక అంశాలను బహిర్గతం చేశారనే అభియోగం ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా.. సెక్రటేరియట్ దగ్గర పలువురు అధికారులపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు, విమర్శలు చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అఖిల భారత సర్వీసులో ఉన్న అధికారులు రాజకీయపరంగా, బయటి వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చేలా ప్రవర్తించకూడదనే నిబంధనలను అతిక్రమించారనే అభియోగాలు ఆయనపై ఉన్నాయి.
Also read:
రెండేళ్లుగా ఒక్క టెస్టూ ఆడలేదు.. ఇంగ్లాండ్‌లో సెంచరీ బాదేశాడు.. ఆ టీమిండియా ప్లేయర్ ఎవరంటే!