Andhra Pradesh: రైతులకు ఏపీ ప్రభుత్వం అలర్ట్.. వెంటనే ఈ పని చేయకపోతే ఇబ్బందులు..
ఏపీలోని రైతులకు ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది. వెంటనే ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాల్సిందిగా సూచించింది. లేకపోతే ప్రభుత్వ పథకాలు పొందటంలో సమస్యలు ఎదుర్కొనే అవకాశముందని తెలిపింది. సమీపంలోని రైతు సేవా కేంద్రాల్లో ఈ ప్రక్రియ చేయనున్నారు. రైతులు దీనికి గమనించాలని కోరింది.

ఏపీలోని రైతులకు కూటమి సర్కార్ కీలక సూచన చేసింది. తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు చేయించుకోవాలని సూచించింది. ప్రతిఒక్క రైతు తప్పనిసరిగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం తెలిపింది. ఫార్మర్ రిజిస్ట్రి చేసుకోవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, రాయితీలు పొందేందుకు రైతులకు ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నుంచే వచ్చే పథకాలు రైతులు సులువుగా పొందేందుకు ఇది సహాయపడుతుంది. ప్రస్తుతం ప్రభుత్వాలు పెట్టుబడి సాయంతో పాటు సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు, పరికరాలు, డ్రోన్లు, విత్తనాలు, ఎరువులు వంటివి అందిస్తోన్నాయి. ఇవన్నీ పొందేందుకు ఫార్మర్ రిజిస్ట్రీ అనేది ఉపయోపగుతుందని రాష్ట్ర ప్రభుత్వం తన ప్రకటనలో వెల్లడించింది.
ఫార్మర్ రిజిస్ట్రీతో ఉపయోగాలు
-సులభంగా ప్రభుత్వ పథకాలు పొందే అవకాశం -కేంద్ర ప్రభుత్వ పథకాలకు అర్హత -పీఎం కిసాన్ పథకం పొందేందుకు తప్పనిసరి -పెట్టుబడి సాయం, సబ్సిడీలు, రాయితీలు పొందే అవకాశం -రైతుకు 11 అంకెల ప్రత్యేక యూనిక్ ఐడీ
ఎలా నమోదు చేయించుకోవాలి..?
రైతులకు ప్రత్యేకంగా 11 అంకెల యూనిక్ నెంబర్ ఐడీ ఫార్మర్ రిజిస్ట్రి ద్వారా అందిస్తారు. దీంతో ప్రభుత్వ పథకాలకు అర్హులను ఎంపిక చేయడానికి సులువుగా ఉంటుంది. సమీపంలోని రైతు సేవా కేంద్రాలకు వెళ్లి నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం వీవీఏలను రైతులు సంప్రదించాలి. గత ఏడాదిగా ఈ నమోదు ప్రక్రియ చేపడుతున్నారు. రైతులు తమ ఆధార్ కార్డ్, పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్‌తో లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్‌ను తమ వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. దీంతో రైతు సేవా కేంద్రాల్లోని సిబ్బంది మీ వివరాలను ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేస్తారు. అనంతరం మీకు యూనిక్ ఐడీ కేటాయిస్తారు. ఈ నెంబర్ మీ మొబైల్‌కు మెస్సేజ్ రూపంలో వెంటనే వస్తుంది. రైతుల ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఇది చాలా ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికీ చాలామంది ఈ ప్రక్రియ పూర్తి చేసుకోలేదు. చాలామంది రైతులకు దీని గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల చేయించుకోవడం లేదు. దీంతో ప్రభుత్వ పథకాలను పొందటంతో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశముంది. దీంతో ఈ ప్రక్రియ పూర్తి చేయించుకోవాల్సిందిగా రైతులకు ప్రభుత్వం అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. అధికారులు గ్రామాల్లోకి వెళ్లి ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాల్సిందిగా సూచిస్తున్నారు.
