Konijeti Rosaiah: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కన్నుమూత

|

Dec 04, 2021 | 9:22 AM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు.

Konijeti Rosaiah: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కన్నుమూత
Rosaiah
Follow us on

Konijeti Rosaiah: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 89సంవత్సరాలు. శనివారం ఉదయం లో-బీపీతో అకస్మాత్తుగా రోశయ్య పడిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన భౌతికకాయం బంజారాహిల్స్ స్టార్ ఆస్పత్రిలో ఉంది. కాంగ్రెస్‌లో కీలక నేతగా ఎదిగారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీగా సేవలందించారు. ఉమ్మడి ఏపీలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఏడుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి రోశయ్య రికార్డు క్రియేట్ చేశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత ఉమ్మడి ఏపీ సీఎంగా రోశయ్య బాధ్యతలు స్వీకరించారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు గవర్నర్‌గా రోశయ్య పనిచేశారు.

1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామములో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు.  ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు.

తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వములో రోడ్డు రహదార్లు శాఖ, రవాణ శాఖల మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత అనేక ముఖ్యమంత్రుల మంత్రివర్గాలలో పలు కీలకమైన శాఖలు నిర్వహించారు. 2004-09 కాలంలో 12వ శాసనసభకు చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైనప్పటికీ, 2009 ఎన్నికల ముందు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీచేయకుండా శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైనారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలిలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవమున్న రోశయ్య 2009, సెప్టెంబర్ 3 నుండి 2010 నవంబరు 24 వరకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2011 ఆగస్టు 31న రోశయ్య తమిళనాడు రాష్ట్ర గవర్నరుగా బాధ్యతలు నిర్వహించారు. 2016 ఆగస్టు 30 వరకూ తమిళనాడు గవర్నరుగా తన సేవలు అందించారు.

సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న నేతగా రోశయ్యకు గుర్తింపు ఉంది. 1979లో టంగుటూరి అంజయ్య ప్రభుత్వంలో రవాణ, గృహనిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖలు.. 1982లో కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలో హోం శాఖ బాధ్యతలు చేపట్టారు. 1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, రవాణ, విద్యుత్తు శాఖలు, 1991లో నేదురుమల్లి జనార్ధనరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలు నిర్వర్తించారు. 1992లో కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలకు మంత్రిగా పనిచేసారు. 2004, 2009లో వై.యస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వములో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 15 సార్లు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలో ప్రవేశపెట్టారు. 1995-97 మధ్యకాలంలో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లో నరసరావుపేట నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

Read Also….  Omicron Variant-Third Wave: ఒమిక్రాన్‌ ఎంట్రీతో అంతా అలర్ట్‌.. కఠిన ఆంక్షలు విధించనున్న ప్రభుత్వం..(వీడియో)