వరద విపత్తు వల్ల ఆంధ్రప్రదేశ్రాష్ట్రానికి 6880 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది. ఈ మేర కేంద్రానికి పంపేందుకు ప్రాథమిక నివేదికను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. 45 వేలమంది వరద బాధితులను రిలీఫ్ కేంద్రాలకు తరలించారు. ఇప్పటి వరకు భారీ వర్షాల కారణంగా ఏపీలో 43 మంది చనిపోయారని రెవెన్యూ శాఖ ప్రకటించింది. 2లక్షల 5 వేల మంది రైతులు 1.93 లక్షల హెక్టార్లలో పంట నష్టపోయారు.
బుడమేరుకు ఆరు గండ్లు పడటంతో విజయవాడ భారీ వర్షాలకు దెబ్బతిందని, సహాయక చర్యలపై 24/7 అప్రమత్తంగా ఉన్నామని రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా అన్నారు. సింగ్ నగర్ ఇంకా వరదలోనే ఉందని, ఒక మొబైల్ యాప్ ద్వారా నష్టాలను అంచనాలు వేస్తామని సిసోడియా తెలిపారు. 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నుంచి మూడు రోజులు పాటు రెవెన్యూ శాఖ ఎన్యూమరేషన్ చేస్తుందని..ఆరోజు ఇంటి యజమాని కచ్చితంగా ఇంట్లోనే ఉండాలని సిసోడియా సూచించారు. వరదలతో చాలామంది ఇతర ప్రాంతాలకు వెళ్లారని ఎన్యూమరేషన్ సమయంలో ప్రజలు ఇళ్ల దగ్గరే ఉండాలని.. లేకపోతే నష్టం అంచనాలు వేయలేమని సిసోడియా అన్నారు. రూ. 6,882 కోట్ల నష్టం వచ్చినట్లు కేంద్రానికి ప్రాథమిక నివేదిక పంపామని సిసోడియా తెలిపారు.
బుడమేరుకు గండ్లు పడతాయన్న సంగతి తెలియదని.. 35 వేల క్యూసెక్కుల వరద వస్తుందని ముందుగా తెలుసని సిసోడియా చెప్పారు. కానీ 2 లక్షల కుటుంబాలను వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలంటే సాధ్యం కాదని..ఆ సమయంలో చాలా ఇబ్బందులు ఉంటాయని ఆయన అన్నారు. గోదావరి జిల్లాలలో వరద వస్తుందని పునరావాస కేంద్రాలకు రావాలని ప్రజలకు చెబితే.. తమకు తెలుసులే అంటారని.. అలాంటి సమస్యే బుడమేరు విషయంలో జరిగిందని ఆర్పీ సిసోడియా వెల్లడించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..