
ఏపీలోని రైతులకు తీపికబురు అందింది. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి పంటల బీమా గడువును పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పంట బీమా కోసం నమోదు చేసుకునేందుకు గతంలో జులై 31వ తేదీ వరకు అవకాశం కల్పించింది. అయితే ఇప్పుడు మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఆగస్ట్ 15వ తేదీ వరకు రైతులు నమోదు చేసుకోవచ్చు. పంట బీమా పథకంలో చేరినవారికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతుల పంటకు నష్టం జరిగితే రైతుకు సాయం అందిస్తారు. వరదలు, వర్షాభావ పరిస్థితులు, తెగుళ్లు, పురుగులు వంటి కారణాలతో పంట నష్టపోయినప్పుడు బీమా అందుతుంది.
కేవలం రూ.1 ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. రూ.1 ప్రీమియంతోనే రైతులకు పంట బీమా సదుపాయం అందిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పంట సాగు చేసే ప్రతీ ఎకరానికి బీమా పొందవచ్చు. ఇప్పటివరకు కొంతమంది రైతులు పంట బీమా కోసం దరఖాస్తు చేసుకోగా.. ఇంకా చాలామంది రైతులు చేరలేదు. దీంతో వారికి కూడా మరో అవకాశం కల్పించేందుకు పంట బీమా పథకం దరఖాస్తు గడువు 15 రోజుల పాటు పొడిగించారు. రైతులు ఇప్పటికైనా చేరాలని ప్రభుత్వం సూచించింది. బ్యాంకులు, కామన్ సర్వీసెస్ సెంటర్ల ద్వారా నమోదు చేసుకోవచ్చు. లేదా రైతు సేవా కేంద్రాలు, ఎన్‌పీసీఐ మొబైల్ యాప్‌ల ద్వారా కూడా చేరవచ్చు.
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ద్వారా రైతుల పంట బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇటీవల సాంకేతిక ఇబ్బందుల వల్ల చాలామంది రైతులు నమోదు చేసుకోలేకపోయారు. దీంతో ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి దృష్టికి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీసుకెళ్లారు. ప్రీమియం చెల్లించేందుకు రైతులకు గడువు ఇవ్వాలని కోరారు. దీంతో బీమా సంస్థలతో కేంద్రం సంప్రదింపులు జరిపింది. దీంతో కేంద్రం సూచనతో బీమా కంపెనీలు గడువును పొడిగించాయి. ఈ పథకం ద్వారా వరి, పత్తి, మిరప, ఉల్లి, పసుపు, నువ్వులు, రాగులు, సజ్జ, మినుము, ఆముదం, పెసర, వేరుశనగ, జొన్న, మొక్కజొన్న వంటి పంటలకు బీమా వర్తింపచేస్తున్నారు.