
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో పేపర్ లీకులు, మాస్ కాపీయింగ్ మధ్య జరుగుతున్న పదో తరగతి పరీక్షలపై ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురు, శుక్రవారాల్లో జరిగే పరీక్షలు మంచిగా జరగాలని భగవంతుడిని కోరుకుంటున్నానని వ్యాఖ్యానించారు. సరైన ఫలితాలు, ఉత్తీర్ణత నమోదు కాకపోతే ఉద్యోగంలో నుంచి తీసేస్తామని హెచ్చరించలేదన్నారు. చదువురాని పిల్లలూ పాస్ అవ్వాలని, మాస్ కాపీయింగ్(Mass Copying) చేయించాలని ఉపాధ్యాయులకు చెప్పలేదని వెల్లడించారు. తాను మంత్రిగా రాజీనామా చేయాలని కొందరు నాయకులు అంటున్నారన్న బొత్స.. మంత్రిగా 13 ఏళ్లు పూర్తి చేసుకున్నానని, ఇదేం మహాభాగ్యం కాదన్నారు. పదో తరగతి పరీక్షల్లో ఇప్పటి వరకు 60 మందిపై కేసులు నమోదు చేశామని వెల్లడించారు. ఉపాధ్యాయులను తప్పుగా అరెస్టు చేస్తే సంఘాలు ఊరుకుంటాయా అని ప్రశ్నించారు. మేం పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తుంటే.. ప్రతిపక్షాలు బురదజల్లాలని చూస్తున్నాయని వివరించారు.
విద్యార్థులకు సరైన విద్య, క్రమశిక్షణ, మంచి భవిష్యత్ అందించడమే గురువులకు పరీక్ష. ఇప్పటి వరకు జరిగిన 5 పరీక్షల్లో ఎక్కడా మాస్ కాపీయింగ్ జరగలేదు. ప్రశ్నపత్రం లీక్ కాలేదు. శ్రీసత్యసాయి జిల్లాలో 10 గంటలకు ప్రశ్నపత్రం బయటకు వచ్చింది. పరీక్షల కేంద్రాలకు సిబ్బంది సెల్‌ఫోన్లు తీసుకెళ్లకుండా చూసేందుకు స్కానింగ్ యంత్రాలు పెడదామని అనుకుంటున్నాం. విద్యార్థులు, పరీక్షల ప్రాధాన్యం, దాని సున్నితత్వంపై నారా లోకేశ్‌కు ఆలోచన ఉందా? పీఆర్సీ, సీపీఎస్‌పై ఉద్యమం చేసిన వారిపై కేసులు పెడితే సంఘాలు ఎందుకు ఊరుకుంటాయి? ఆ సంఘాలకు లోకేశ్ నాయకుడా? ప్రతి దాన్ని రాజకీయాలు చేద్దామంటే అభాసుపాలవుతారు.
– బొత్స సత్యనారాయణ, ఏపీ విద్యాశాఖ మంత్రి
మరోవైపు.. ఏపీ సీఎం జగన్ కు టీడీపీ లీడర్ నారా లోకేశ్ లేఖ రాశారు. రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష పత్రాల లీకేజీలతో విద్యార్థులకు తీరని నష్టం జరుగుతోందని లేఖలో తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారిగా నిర్వహిస్తున్న పదోతరగతి పరీక్షల నిర్వహణలో పూర్తి విఫలమయ్యారని ఆరోపించారు. పీఆర్సీ, సీపీఎస్ రద్దు కోసం నిరసన చేపట్టిన ఉపాధ్యాయులపై కక్ష పెట్టుకుని వేధిస్తున్నారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీచర్లుకు టెన్త్ ఫలితాల టార్గెట్లు పెట్టారని, పేపర్ లీక్ లకు వారిని బాధ్యుల్ని చేస్తూ సస్పెండ్ చేస్తున్నారని మండిపడ్డారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవీచదవండి
Nellore District: డాక్టర్ కాదు రాబందు.. శవంపై చిల్లర ఏరుకునే ప్రయత్నం.. ప్రభుత్వం సీరియస్
Andhra Pradesh: “పరీక్షల నిర్వహణలో పూర్తిగా విఫలయ్యారు”.. సీఎం జగన్ కు లోకేశ్ లేఖ