Free bus for Women: విజయనగరం జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహిళల్లో ధైర్యం నింపేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన దిశా యాప్ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. విజయనగరంలో మహిళలు తమ మొబైల్ ఫోన్‌లలో దిశా యాప్‌ను చూపిస్తే.. పట్టణంలోని ముఖ్య కూడళ్ల నుంచి ఇతర ప్రాంతాలకు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్టు ఎస్పీ దీపికా పాటిల్ వెల్లడించారు. ఇందుకోసం పోలీస్ శాఖ రెండు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్టు ఆమె తెలిపారు. శనివారం విజయనగరంలో దిశా యాప్‌పై నిర్వహించిన అవగాహన సదస్సుకు డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి హాజరయ్యారు.
ఇదిలావుంటే, ‘దిశ యాప్’. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి మహిళల భద్రతకు భరోసా.. వారికో రక్షణ.. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూపొందింపచేసిన దిశ యాప్ ప్రతి మహిళ మొబైల్‌లో ఒక ఆయుధంలా ఉండాలని జగన్ సర్కారు సంకల్పించింది. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు చెక్ పెట్టేందుు ఒక్క బటన్ నొక్కి ఉక్కుపాదం మోపేలా దిశా యాప్ ను డెవలప్ చేసింది ఏపీ ప్రభుత్వం. మహిళల మానప్రాణాలకు రక్షణే ప్రధాన కర్తవ్యంగా దిశా యాప్‌ను రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం సీఎం జగన్ సంకల్పంగా దిశ యాప్‌కు విస్తృత ప్రచారం కల్పించింది.
ఇందులో భాగంగానే ఆపదలో ఉన్న ప్రతి మహిళ అత్యవసర సాయం కోసం దిశ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని భావించింది. ఎస్‌వోఎస్ బటన్ నొక్కితే చాలు ఆయా ప్రాంతాల్లోని పోలీసులు అందుబాటులోకి వచ్చేలా దిశ యాప్‌ను ప్రతి మహిళ స్మార్ట్ ఫోన్ లో అందుబాటులో ఉండేలా చేసింది. ఆపదలో చిక్కుకున్న మహిళ దిశ యాప్ ఉపయోగించగానే, ఆమె ఉన్న లొకేషన్ తోపాటు చిరునామా దిశ కమాండ్ కంట్రోల్ రూమ్ కు సెకన్లలోనే సమాచారంగా చేరుతుంది. వాయిస్‌తో పాటు పది సెకన్ల వీడియో కూడా రికార్డ్ చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ కి తమ విపత్కర పరిస్థితిని దిశ యాప్ ద్వారా చేరవేస్తుంది. ఈ నేపథ్యంలోనే మహిళలకు రక్షణగా నిలిచే ఆ యాప్‌ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని విజయనగరం ఎస్పీ దీపికా పాటిల్ తెలిపారు.
Read Also…