DGP Gautam Sawang Praise NGOs: కరోనా కాటుకు బలైన వ్యక్తుల అంత్యక్రియల సేవలను వారి సొంత కుటుంబ సభ్యులు కూడా ముందుకు రాని పరిస్థితుల్లో సేవలందిస్తున్న స్వచ్ఛంద సంస్థలను ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రశంసించారు. కోవిడ్ విపత్తు సమయంలో ప్రజలకు అలుపెరగని సేవలందిస్తున్న స్వచ్ఛంద సేవకులతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌషల్ అధ్వర్యంలో కుల, మతాలతో సంబంధం లేకుండా అందరికీ చేసిన నిస్వార్థ సేవలకు ప్రశంసలు అందుకున్నారు. మానవత్వం సజీవంగా ఉందని నిరూపించారు చీరాలకు చెందిన అపద్బంధు టీం. అలాగే సింగరాయకొండకు చెందిన యువనేస్తం ఫౌండేషన్, చీరాలకు చెందిన శివం ఫౌండేషన్ సభ్యులతో ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో డీజీపీ మాట్లాడారు.
ఇందులో భాగంగా కర్నూలుకు చెందిన సద్గురు దత్త కృపాలయం ప్రతినిధులతో కలిసి ఎస్పీ డాక్టర్ కె.ఫక్కీరప్ప స్థానిక పోలీసు కార్యాలయంలోని కోవిడ్ కంట్రోల్‌రూం నుంచి కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ వారి సేవలను వివరించారు. 8 ఏళ్ల నుంచి ప్రతిరోజూ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో 1,200 మంది రోగులు, వారి కుటుంబ సభ్యులకు నిత్యాన్నదానం చేస్తున్నారని, 10 ఏళ్లుగా వైకుంఠ శ్మశానవాటికలో ఉచితంగా అంత్యక్రియల సేవలు అందిస్తున్నారన్నారు. ఆక్సిజన్ సిలిండర్ల పంపిణీ, అంబులెన్సుల సదుపాయం కల్పించారన్నారు. డీజీపీ వారితో మాట్లాడి సేవలను అభినందిం0చారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల పోలీస్ యూనిట్ అధికారులతో శుక్రవారం రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ఏపీ హెడ్ క్వార్టర్ నుండి కరోనా విపత్తులో సేవలందించిన స్వచ్ఛంద సంస్థల సేవకులకు సన్మాన కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తు క్లిష్ట సమయంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సేవలు అందిస్తున్న వారి సేవలను డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రశంసించారు. కరోనా సమయంలో బాధితులకు, ప్రజలకు, పోలీసులకు సేవలందించిన వారిని పోలీసుశాఖ సత్కరించింది. మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో డీజీపీ మాట్లాడుతూ బంధాలు, బంధుత్వాలతోపాటు ఎందరో బిడ్డలకు తల్లితండ్రులను దూరం చేసిన కొవిడ్ మహమ్మారిపై పోరులో మానవత్వమే పరమావధిగా ముందుకొచ్చి సేవచేసిన మీరందరూ ‘మానవత్వ ధీర’లు అంటూ ప్రశంసించారు. విజయవాడ హెల్పింగ్ హ్యాండ్స్ వెంకట్, స్వచ్చంద సేవకుడు శ్రీరామ్‌లను డీజీపీ అభినందించారు.