AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా రక్కసి.. ఏపీని ముంచెత్తుతున్న ఒమిక్రాన్ RF.5 వేరియంట్.. 26కి చేరిన పాజిటివ్ కేసులు..

ఆంధ్రప్రదేశ్‌లో ఒమిక్రాన్ RF.5 వేరియంట్ వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 7 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 26కు చేరింది. ఇప్పటివరకు నలుగురు మృతి చెందగా, వారంతా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారేనని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 10 జిల్లాలకు వైరస్ విస్తరించగా, ప్రజలు భయపడకుండా అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యశాఖ సూచిస్తోంది.

కరోనా రక్కసి.. ఏపీని ముంచెత్తుతున్న ఒమిక్రాన్ RF.5 వేరియంట్.. 26కి చేరిన పాజిటివ్ కేసులు..
Coronavirus
Shaik Madar Saheb
|

Updated on: Jul 22, 2026 | 8:53 AM

Share

పక్కవాళ్లు తుమ్మినా, దగ్గినా భయపడాల్సిన రోజులు మళ్లీ వచ్చేశాయ్.. అందులోనూ తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఉన్నాయని చెప్పారా.. కాస్త అనుమానించాల్సిందే. జ్వరం కూడా ఉందంటే.. ముక్కులో పుల్ల పెట్టే టెస్ట్ చేయించుకోవాల్సిందే. ఏపీలో ‘ఓమిక్రాన్ RF.5’ వైరస్ ముప్పేట ముంచెత్తుతోంది. నిన్నటివరకు ఒకటి రెండేలే అనుకున్న కేసులు.. ఇప్పుడు 26కి చేరాయి. ఇప్పటికే నలుగురి ప్రాణాలను బలితీసుకుంది ఈ వేరియంట్. కడప నుంచి విశాఖ వరకు ఏకంగా 10 జిల్లాలకు ఈ మహమ్మారి పాకేసింది. తాజాగా.. ఏపీలో కొత్తగా 7 కరోనా కేసులు నమోదయ్యాయి.. దీంతో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 26కి చేరింది. కరోనాతో ఇప్పటి వరకు నలుగురి మృతి.. వారంతా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారని అధికారులు తెలిపారు. అయితే.. ఎవరు భయపడాల్సిన అవసరం లేదని.. ఈ వేరియంట్ అంత ప్రమాదకరమైనది కాదని వైద్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు చనిపోయిన నలుగురు దీర్ఘకాలిక వ్యాధులతో చనిపోయిన వారేనని తెలిపారు. అందులో ముగ్గురు కడప జిల్లా, ఒకరు కాకినాడకు చెందినవారు ఉన్నారు.

జిల్లాల వారీగా కరోనా కేసులు..

బాపట్ల 2, ఈస్ట్ గోదావరి 3, ఏలూరు 1, గుంటూరు 6, కాకినాడ 2, ఎన్టీఆర్ జిల్లా 1, పార్వతీపురం మన్యం 1, పొట్టి శ్రీరాములు నెల్లూరు 1, విశాఖపట్నం 1, వైయస్సార్ కడప 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. ప్రస్తుతం 8 మంది ఆసుపత్రుల్లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. మరో నలుగురు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతుండగా, ముగ్గురు కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు.

బాధితుల శాంపిళ్లను పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ-NIVకి పంపగా.. ఈ ముప్పుకి కారణం ‘ఒమిక్రాన్‌ ఆర్‌ఎఫ్‌.5’ అని తేలింది. ఇది గతంలో వచ్చిన JN.1 వేరియంట్ నుంచి రూపాంతరం చెందిన సబ్‌లైనేజ్. ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు ఆగ్నేయాసియా దేశాలు దీని ఉనికిపై ముందే హెచ్చరించాయి. దీంతో ఏపీ ప్రభుత్వం, సర్వైలెన్స్ విభాగం అలర్ట్ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితిని ప్రతి నిమిషం అబ్జర్వ్ చేస్తున్నాయి.

ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదు..

ఏపీలో కరోనా కేసులు పెరుగుతుండడంపై డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్-DME రియాక్ట్ అయింది. ప్రజలు ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, తగిన జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని భరోసా ఇచ్చింది. ఓమిక్రాన్ రకాలు సాధారణంగా జలుబు, దగ్గు, ఒళ్లునొప్పుల వంటి లక్షణాలనే కలిగి ఉంటాయని చెప్పింది. ఏపీలో చనిపోయిన ఆ నలుగురు కూడా ఇదివరకే హైపర్‌టెన్షన్, షుగర్, కిడ్నీ వ్యాధుల వంటి తీవ్రమైన దీర్ఘకాలిక సమస్యలతో బాధపడ్డారని అధికారులు చెబుతున్నారు. అందుకే, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఇంకాస్త జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఒక్క ఏపీలోనే కాదు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదవుతున్నాయని ఏపీ హెల్త్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. జూలై 1 నుంచి 16వ తేదీ మధ్య మొత్తం 339 కేసులు రిజిస్టర్ అయ్యాయి. కేరళలో 115 కరోనా కేసులు, కర్నాటకలో 64, మహారాష్ట్రలో 43, తమిళనాడులో 39, ఢిల్లీలో 18, అండమాన్‌లో 18, రాజస్తాన్‌లో 12 కేసులతో పాటు, మిగతా రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు నమోదయ్యాయి.

సింగపూర్ సహా ఆగ్నేయాసియా దేశాల నుంచి విస్తరించిన ఈ RF.5 వేరియంట్.. ఇప్పుడు పొరుగు రాష్ట్రాలైన కేరళ, కర్నాటకతో పాటు ఏపీనీ చుట్టేస్తోంది. సాధారణ ఓమిక్రాన్‌తో పోలిస్తే ఇది ఎక్కువ ప్రాణాంతకం కాదని వైద్యులు చెబుతున్నప్పటికీ, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, వృద్ధులు, శ్వాసకోస సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మళ్లీ మాస్కులు ధరించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడమే దీనికి సరైన నివారణ మార్గం..

Follow Us