CM YS Jagan: నేను లేకుంటే గౌతమ్ రాజకీయాల్లోకి వచ్చేవాడు కాదేమో.. నా ప్రతి అడుగులోనూ తోడున్నాడుః వైఎస్ జగన్
నెల్లూరు జిల్లా గ్రామీణ మండలం కనుపర్తిపాడులోని వీపీఆర్ ఫంక్షన్ హాలులో నిర్వహించిన దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సంస్మరణ కార్యక్రమంలో ఏపీ సీెం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
AP CM YS Jagan Mohan Reddy: గౌతమ్‌లాంటి మంచి మిత్రుడిని కోల్పోవడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నామని.. నమ్మడానికి ఇంకా కష్టంగానే ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎంత చెప్పినా గౌతమ్ రెడ్డి లేని లోటు తీరనిదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. నెల్లూరు జిల్లా(Nellore District) గ్రామీణ మండలం కనుపర్తిపాడులోని వీపీఆర్ ఫంక్షన్ హాలులో నిర్వహించిన దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి(Mekapati Goutham Reddy) సంస్మరణ కార్యక్రమంలో జగన్ మాట్లాడారు. గౌతమ్‌రెడ్డి కుటుంబానికి దేవుడు తోడుగా ఉండాలని.. వారికి అన్ని రకాలుగా మంచి జరగాలని ఆకాంక్షించారు. గౌతమ్ చిత్రపటానికి నివాళి అర్పించి అనంతరం ప్రసంగించారు.
రాజకీయాల్లో తనకు తోడుగా, స్నేహితుడిగా ఉండేవారన్నారు. వయసులో పెద్దవాడైనా.. ఆ గర్వం కనిపించేది కాదని, పైగా సోదర భావంతో మెలిగేవాడని గుర్తుచేసుకున్నారు. నా ప్రతి అడుగులోనూ తోడుగా ఉన్నాడు. రాష్ట్ర పెట్టుబడుల కోసం ఎంతో తాపత్రయపడ్డాడని, చివరి క్షణం వరకూ రాష్ట్ర శ్రేయస్సు కోసమే పాటుపడ్డారని చెప్పారు. ఆ కుటుంబానికి తానే కాదు.. వైఎస్సార్‌సీపీ మొత్తం తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు సీఎం జగన్. గౌతమ్‌రెడ్డి లాంటి మంచి వ్యక్తిని కోల్పోవడం బాధాకరం అని, ప్రతీ అడుగులో గౌతం తనకు తోడుగా ఉండేవాడని సీఎం జగన్ అన్నారు. రాజమోహన్ గారికంటే గౌతమ్ ఆత్మీయత తనకు ఎక్కువగా అనిపించేదని, తన ప్రోత్సాహంతోనే గౌతమ్ రాజకీయాల్లోకి వచ్చారని సీఎం జగన్ గుర్తు చేసుకున్నారు.
నేను లేకపోయుంటే గౌతమ్ బహుశా రాజకీయాల్లోకి వచ్చేవాడు కాదేమో. కష్టకాలంలో కాంగ్రెస్ ఎంపీగా ఉన్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి నాకు అండగా నిలబడేందుకు గౌతమ్‌తో ఉన్న సాన్నిహిత్యమే కారణమని సీఎం జగన్ అన్నారు. రాజమోహన్‌రెడ్డి నా వైపు ఉండేందుకు గౌతమ్ ఒత్తిడే పనిచేసింది. 2009 నుంచి సాగిన ఆ ప్రయాణంలో ప్రతి అడుగులోనూ స్నేహితుడిగా అతడు నాకు తోడున్నాడు. గౌతమ్‌రెడ్డి నాకంటే ఒక సంవత్సరం పెద్దోడు.. అయినా ఏ రోజూ అలా ఉండేది కాదు. నన్నే అన్నగా భావించేవాడు. మేమంతా ఉన్నాం.. నువ్వు చేయగలవు అని ప్రోత్సహించేవాడు. ఆ తర్వాత నేనే రాజకీయాల్లోకి తీసుకొచ్చాను. మంచి నాయకుడిగా ఎదిగాడు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, మంచి మంత్రిగా కొనసాగారు.
పరిశ్రమలు తీసుకొస్తే మన రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని గౌతమ్ తాపత్రయ పడేవాడు. దుబాయ్ సదస్సుకు వెళ్లే ముందు కూడా నన్ను కలిశాడు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత నన్ను కలిసి అక్కడ విషయాలు వివరించేందుకు సమయం కూడా తీసుకున్నారన్నారు. ఈలోపే ఇలా జరిగిపోయింది. రాజమోహన్‌రెడ్డి సూచన మేరకు కళాశాలను అగ్రికల్చర్ కాలేజ్‌గా, అవకాశముంటే యూనివర్సిటీగా మారుస్తామని సీఎం జగన్ ప్రకటించారు. గౌతమ్ చిరకాల వాంఛ అయిన వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాలకు నీరందిస్తాం. మే 15లోపు సంగం బ్యారేజ్ పనులు పూర్తిచేస్తామన్నారు. ఆ బ్యారేజీకి ‘మేకపాటి గౌతమ్ సంగం బ్యారేజ్’గా నామకరణం చేసి దాన్ని ప్రారంభిస్తాం’’ అని జగన్ స్పష్టం చేశారు.