ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఎన్నికల నగారా మోగనుండడంతో ప్రధాన, ప్రతి పక్ష నేతలు జనం మధ్యలో ఉంటూ.. సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీడీపీ బస్సు యాత్రల్లో విభేదాలు భగ్గుమంటున్నాయి. టీడీపీలో గ్రూపుల గోల ఒక్కసారిగా బహిర్గతమవుతోంది. పార్టీలో ఆధిపత్యం కోసం తెలుగు తమ్ముళ్లు ఒకరికొకరు కొట్టుకునే స్థాయి వెళ్తున్నారు. తాజాగా.. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ టీడీపీలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. భవిష్యత్తుకు గ్యారెంటీ బస్సు యాత్ర పెనుకొండకు చేరుకుంది.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ క్రమంలో.. టీడీపీ కార్యకర్తలు రెండు వర్గాలుగా చీలిపోయారు. సవితమ్మ, బీకే పార్ధసారధి వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. జై బీకే అని.. ఓ వర్గం నినాదాలు చేస్తే.. జై సవితమ్మ అంటూ మరో వర్గం రెచ్చిపోయి స్లోగన్స్ చేసింది. ఇక.. రెండు వర్గాల నినాదాలతో పెనుగొండ ఎన్టీఆర్ సర్కిల్ మారుమోగింది. ఈ క్రమంలోనే.. తెలుగు తమ్ముళ్లు ఒకరినొకరు తన్నుకున్నారు. దాంతో.. రెండు వర్గాలను అదుపు చేసేందుకు పోలీసులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. అప్రమత్తమైన టీడీపీ నేతలు.. ఎవరైనా గ్రూపులు కడితే సహించేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేయటంతో వివాదం సద్దుమణిగింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..