కుల గణన ప్రక్రియలో భాగంగా బీసీ సంక్షేమ శాఖ నేతృత్వంలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తోంది ఏపీ ప్రభుత్వం. కుల సంఘాలు, బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, మేధావులు, ప్రజాప్రతినిధులను ఆహ్వానించి.. సూచనలు, సలహాలు స్వీకరిస్తోంది. రెండు రోజుల పాటు జిల్లా స్థాయి సమావేశాలు కొనసాగగా.. నేటి నుంచి రీజినల్ మీటింగ్స్ షురూ అయ్యాయి. రాజమండ్రి వేదికగా తొలి రీజినల్ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సదస్సులో కలెక్టర్ మాధవీలత, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్, ఎంపీ భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతోపాటు పలువురు ప్రజా ప్రతినిధులు, వివిధ కుల సంఘం నేతలు పాల్గొన్నారు. కుల గణన ప్రక్రియను ముట్టకోవడానికే భయపడే పరిస్థితుల్లో.. సీఎం జగన్ దాన్ని చాలెంజ్‌గా తీసుకున్నారన్నారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్. ఏపీలో మొత్తం 723 కులాలపై సమగ్ర గణన చేయాల్సి ఉందని చెప్పారు.
ఎప్పుడో బ్రిటీష్ కాలంలో జరిగిన కులగణనను మళ్లీ సీఎం జగన్ హయాంలో చేపట్టడం హర్షణీయమన్నారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్. జనగణన జరిగినప్పుడు కులగణన ఎందుకు జరగకూడదనే డిమాండ్ ఎప్పటినుంచో ఉందన్నారు ఎంపీ భరత్.
మొత్తంగా.. ఏపీ ప్రభుత్వం సాహసోపేతంగా చేపట్టిన కులగణన ప్రక్రియపై వివిధ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో రిజర్వేషన్లు జనాభా దామాషా ప్రకారం అమలు జరగడానికి కుల గణన దోహదపడుతుందంటున్నారు మేధావులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.