Tirupati By Election 2021: తిరుపతిలో మా పార్టీ అభ్యర్థి పోటీ చేస్తారంటే.. లేదు మా పార్టీ అభ్యర్థి పోటీ చేస్తారంటూ మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ నేతల మధ్య కొంత కాలంగా సాగుతున్న పోరుకు ఎట్టకేలకు తెరపడింది. చివరికి అక్కడ పోటీలో నిలిచేది బీజేపీ అభ్యర్థే అని తేలింది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఇంచార్జీ వి. మురళీధరన్‌ను ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించిన ఆయన.. ప్రజల కోసం పోరాడేందుకు తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తున్నారని స్పష్టం చేశారు. తిరుపతి ఉప ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థి ఎంపికపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సుదీర్ఘ మంతనాలు జరిపారని, ఈ సమావేశంలో బీజేపీ అభ్యర్థిని తిరుపతి ఉప ఎన్నికల్లో నిలబెట్టాలని ఏకగ్రవంగా నిర్ణయించినట్లు మురళీధరన్ వెల్లడించారు.
తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తున్నాయన్న ఆయన.. ఈ ఎన్నికల్లో విజయం తమదే అని విశ్వాసం వ్యక్తం చేశారు. తిరుపతి ఎన్నికల్లో ఘన విజయంతో రాష్ట్రంలో విజయ యాత్ర ప్రారంభం అవుతుందని అన్నారు. బీజేపీ, జనసేన కలిసి.. వైసీపీ, టీడీపీల అసలు రంగును బయటపెడతాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలను ఆ రెండు పార్టీల కబందహస్తాల నుంచి విముక్తి కల్పిస్తామని అన్నారు. వైసీపీ, టీడీపీలు తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసే విధానాలను అవలంభిస్తున్నాయని ఆరోపించిన మురళీధరన్.. ఈ ఉప ఎన్నికలో ప్రజలే వారికి తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఆ రెండు పార్టీలు అవలంభిస్తున్న పక్షపాత విధానాలను అంతమొందించే సమయం ఆసన్నమైందని, తిరుపతి ప్రజలు వైసీపీ, టీడీపీలకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
కాగా, తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ హఠాన్మరణంతో ఆ పార్లమెంట్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికకు త్వరలో షెడ్యూల్ విడుదల కానుండగా.. ప్రధాన పార్టీలు పోటీకి సై అంటే సై అంటున్నాయి. ఇప్పటికే టీడీపీ తన అభ్యర్థిని ప్రకటించి ఈ ఎన్నికల పోరులో ముందు వరుసలో ఉంది. ఇక సిట్టింగ్ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తున్న వైసీపీ ఇంకా తన అభ్యర్థిని ఖరారు చేయలేదు. మరోవైపు ఇంతకాలం జనసేన, బీజేపీ మధ్య అభ్యర్థి ఎంపికపై తీవ్ర చర్చలు జరిగాయి. తమ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తారంటే.. లేదు తామే పోటీ చేస్తామంటూ రెండు పార్టీల నేతలు గట్టిగానే వాదులాడారు. చివరికి ఇరు పార్టీల మధ్య జరిగిన చర్చల్లో సయోధ్య కుదరడంతో.. తిరుపతి ఉప పోరులో బీజేపీ అభ్యర్థినే పోటీ చేయించాలని డిసైడ్ అయ్యారు.
AP BJP Incharge V Muralidharan Tweet:
@BJP4India‘s victory march will begin from TPTY@BJP4Andhra & @JanaSenaParty will expose the shady designs of @YSRCParty & @JaiTDP that undermine the beliefs of devotees.
These satraps self-serving & partisan approach deprived people of TPTY. Time to put an end to such trends
— V Muraleedharan (@VMBJP) March 12, 2021
Also read:
రెండు తెలంగాణ ఎమ్మెల్సీ స్థానాలకు మొత్తం 164 మంది పోటీ, సినిమా పోస్టర్ సైజులో బ్యాలెట్ పేపర్.!
క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్.. రెండు నెలలకు మైదానంలో అడుగుపెట్టిన టీం ఇండియా ఆల్‌రౌండర్..