AP BJP: పోరాటాలతో సమస్యకు పరిష్కారం.. ఏపీలో సమరానికి బీజేపీ సై.. బెజవాడలో భారీ బహిరంగ సభ!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏమాత్రం పట్టులేని భారతీయ జనతా పార్టీ, భారీ బహిరంగ సభతో బలప్రదర్శన చేపట్టాలని భావిస్తోంది. ఈ నెల 28న విజయవాడలో నిర్వహించతలపెట్టిన బహిరంగ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేపట్టి విజయవంతం చేయాలని చూస్తోంది.
AP BJP core committee meeting: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏమాత్రం పట్టులేని భారతీయ జనతా పార్టీ, భారీ బహిరంగ సభతో బలప్రదర్శన చేపట్టాలని భావిస్తోంది. ఈ నెల 28న విజయవాడలో నిర్వహించతలపెట్టిన బహిరంగ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేపట్టి విజయవంతం చేయాలని చూస్తోంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి కేంద్ర మంత్రి, బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మురళీధరన్ నివాసంలో కోర్ కమిటీ సమావేశమై చర్చించింది. ఈ సమావేశానికి కోర్ కమిటీ నేతలు జీవీఎల్ నరసింహారావు, వైఎస్ చౌదరి (సుజనా చౌదరి), టీజీ వెంకటేశ్, సీఎం రమేశ్, కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి, వై. సత్యకుమార్, సునీల్ దేవధర్ తదితరులు హాజరయ్యారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు సోము వీర్రాజు ప్రకృతి వైద్య చికిత్సలో ఉన్నందున, వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
యువతకు గాలం – పోరాటమే మార్గం ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ, తెలుగుదేశం పార్టీల వెంట రాష్ట్ర ప్రజానీకాన్ని తమవైపు ఆకట్టుకునే క్రమంలో యువతకు గాలం వేయాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఈ క్రమంలో పార్టీలో యువతను పెద్ద ఎత్తున చేర్చుకుని, బాధ్యతలు అప్పగించేందుకు సమాలోచనలు జరుపుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల వెంట ఉన్న మెజారిటీ ప్రజానీకం నుంచి తమవైపు ఆకట్టుకునేందుకు ఏం చేస్తే బావుంటుంది అన్న విషయంపై కోర్ కమిటీ నేతలు చర్చించారు. ఈ క్రమంలో ప్రజా సమస్యలపై పోరాడాలని నిర్ణయించినట్టు తెలిసింది. అయితే, కేంద్రంలో అధికారంలో ఉన్నందున కొన్ని అంశాల్లో కేంద్ర ప్రభుత్వంపై నెపాన్ని నెట్టివేసే అవకాశం ఉంటుంది కాబట్టి, లోతుగా అధ్యయనం చేసిన తర్వాతనే అంశాలను ఎంపిక చేసుకుని, వాటిపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజాందోళనలు చేపట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ధర్నాలు, రాస్తారోకోలు, భారీ నిరసన కార్యక్రమాలతో ముందుకెళ్లాలని నాయకత్వం భావిస్తోంది.
అమరావతి రైతుల పాదయాత్రకు ఇప్పటికే మద్ధతు పలికిన బీజేపీ, రాష్ట్రంలో సహకార పంచదార మిల్లులను మూసివేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టనున్నట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ విషయంలోనూ ఉద్యోగులకు అండగా నిలవాలని ఇప్పటికే నిర్ణయించింది. రాష్ట్రంలో రోడ్ల దుస్థితి, కేంద్ర నిధులను దారిమళ్లించడం సహా మరికొన్ని అంశాలపై పోరాటాలు చేసేందుకు సమాయత్తమవుతోంది.
— మహాత్మ కొడియార్, టీవీ 9 ప్రతినిధి, ఢిల్లీ