ఎస్ రాయవరం: ఓ సాధారణ ఆటో డ్రైవర్ ఇంటికి ఏకంగా రూ. మూడున్నర లక్షల కరెంట్ బిల్లు రావడంతో కళ్లు తేలేశాడు. చిన్నపూరి గుడిసెకు అంతపెద్ద మొత్తంలో కరెంటు బిల్లు రావడంతో లబోదిబో మంటూ అధికారులకు మొరపెట్టుకున్నాడు. ఈ విచిత్ర ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎస్ రాయవరం మండలంలో చోటుచేసుకుంది.
అనకాపల్లి జిల్లాలోని ఎస్ రాయవరం పరిధిలోని గోకులపాడు దళిత కాలనీలోని పూరి గుడిసెలో రాజుబాబు అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇంత చిన్న పూరి గుడిసెకు అంత పెద్ద మొత్తంలో కరెంట్ బిల్లు రావడంతో రాజుబాబు కుటుంబ సభ్యులందరూ షాక్‌కు గురయ్యారు. దీనిపై విద్యుత్తు అధికారులను సంప్రదించగా.. సాంకేతిక సమస్య వల్ల పెద్ద మొత్తంలో బిల్లు వచ్చినట్లు గుర్తించారు. అనంతరం బిల్లును సరిచేసి ఈ నెల కరెంట్ బిల్లు రూ.155 వచ్చిందని తెలియజేశారు. సాంకేతిక సమస్య కారణంగా ఇలా జరిగిందని, రాజుబాబుకి ఎస్సీ రాయితీ ఉండడంతో బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని కొరుప్రోలు సెక్షన్ ఏఈ గోపి వివరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.