AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tiger Cubs: అయ్యో.. పాపం.. అమ్మ వద్దకు దారేది..? కూనలు ఇక జూకు పోవాల్సిందేనా..?

నాలుగు పులి కూనలు. వయసు సుమారు 50 రోజులు. తల్లి నుంచి వేరుపడ్డాయి. వాటిని తల్లితో కలిపేందుకు అటవీ అధికారులు చేసిన ప్రయత్నాలువిఫలమయ్యాయి. ఇప్పుడు ఆ పులి పిల్లల భవిష్యత్‌ ఏంటి? అమ్మను కలుస్తాయా? అడవి బాట పట్టి అమ్మ ఒడికి చేరతాయా? లేక జూలో జంతువులుగా మిగిలిపోతాయా?

Tiger Cubs: అయ్యో.. పాపం.. అమ్మ వద్దకు దారేది..? కూనలు ఇక జూకు పోవాల్సిందేనా..?
Tiger Cubs
Ram Naramaneni
|

Updated on: Mar 09, 2023 | 5:48 PM

Share

అడవిలో పెద్ద పులి… అడవి బయట పులి కూనలు… ఎరక్కపోయి ఇరుక్కుపోయాయి పిల్ల పులి కూనలు. ఆహారం కోసం వచ్చి తల్లీపిల్లలు వేరైపోయాయి. గత నాలుగు రోజులుగా తల్లి ప్రేమ కోసం పిల్లలు విలవిలలాడున్నాయి. జాడలేని తల్లి కోసం కలవరం చెందుతున్నాయి. తల్లీ పిల్లలను కలిపడం.. ఫారెస్ట్ సిబ్బందికి ఇదో బిగ్‌ టాస్క్‌గా మారిపోయింది. పులికూనలను వదిలిపెట్టి వెళ్లిన తల్లి పులి కోసం ఆపరేషన్ మదర్ టైగర్ కొనసాగుతూనే ఉంది. తల్లి చెంతకు పులికూనులను చేర్చడం కోసం అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పెద్ద గుమ్మాడపురం అటవీ ప్రాంతంలో పులి అడుగుజాడలను గుర్తించిన అధికారులు, ఆ ప్రాంతంలో పులి సంచరిస్తుందని తెలుసుకున్నారు. ఆత్మకూరు డిఎఫ్ఓ కార్యాలయం నుంచి నల్లమల్ల అడవిలోని ముసలిమడుగు బేస్ క్యాంప్ పరిసరాల్లో ఉన్న మదర్ టైగర్ పరిసరాల్లోకి 6 వాహనాల్లో పులి కూనలను తరలించారు.

రాత్రంతా ముసలిమడుగు ప్రాంతాల్లో తల్లి పులి కోసం వేచిచూశారు ఫారెస్ట్ అధికారులు. తల్లిపులి రాకపోవడంతో పులి పిల్లలను ఆత్మకూరు DFO కార్యాలయానికి మళ్లీ తరలించారు. తెల్లవారితే ఎండ వేడిమికి పులి పిల్లలు ఇబ్బంది పడతాయనే ఉద్దేశంతో ఆపరేషన్‌‍ను నిలిపివేశారు. మిగతా ప్రాంతాల్లో ట్రాప్ కెమెరా, ప్లగ్ మార్క్స్ ఆధారాలు సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. NTCA ఆదేశాల ప్రకారం.. 300 మంది సిబ్బంది.. 50 మంది అటవీ శాఖ అధికారులతో ఆపరేషన్ కొనసాగిస్తున్నారు అధికారులు. ప్రస్తుతం నంద్యాల జిల్లా ఆత్మకూరు డిఎఫ్ ఓ కార్యాలయంలో పులికూనలు ఉన్నాయి. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పులి కూనలను మానిటరింగ్ చేస్తున్నారు ఫారెస్ట్ అధికారులు. పులికూనల ఆరోగ్య పరిస్థితిపై అనుమానాలు వస్తుండటంతో తొలిసారి సీసీ కెమెరాలు ఫుటేజ్ రిలీజ్ చేసింది ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్. పులి పిల్లలకు పాలు, ఉడకబెట్టిన చికెన్ లివర్‌ను ఆహారంగా అందిస్తున్నారు. కేవలం ఆహారం అందించేందుకే పులి కూనల గదిలోకి సిబ్బందికి అనుమతి. పులి కూనలను ముట్టుకోకుండానే నీరు ఆహారం అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ముసలిమడుగు రేంజ్ దోవ కుంట ప్రాంతంలో పులి తిరుగుతుందనేది ఓ అవగాహన.. కానీ అది ఖచ్చితంగా ఎక్కడ ఉందనేది తెలియడం లేదు. ఒకవేల పులి ఆచూకీ కనిపెట్టినా.. కూనలను తీసుకెళ్లినా.. మనుషులు తాకిన పిల్లలను తల్లి తన వడికి చేర్చుకుంటుందా లేదా అనేది పెద్ద సందేహం.

బుధవారం రాత్రి ఆత్మకూరు డిఎఫ్ఓ కార్యాలయం నుంచి నల్లమల అడవిలోని ముసలిమడుగు బేస్ క్యాంప్ పరిసరాల్లో ఉన్న మదర్ టైగర్ చెంతకు 6వాహనాల కాన్వాయ్ లో పులి కూనలను తరలించారు. అంతకుముందు ముసలి మడుగు గ్రామం అడవి ముక్కల ప్రాంతంలో పెద్ద పులి సంచారాన్ని గొర్రెల కాపరి గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో తల్లి పులి చెంతకు పిల్లలను తీసుకువెళ్లే సాహసోపేతమైన అటవీ శాఖ అధికారుల ఆపరేషన్‌లో టీవీ9 కూడా భాగమైంది.

ఫీల్డ్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో తల్లి చెంతకు నాలుగు ఆడ పులి పిల్లల తరలింపును చేపట్టారు. మనుషులు తాకిన పిల్లలను తల్లి తన వడికి చేర్చుకుంటుందా లేదా అనే ఉత్కంఠ ఓవైపు…కూనలు కనిపించక తల్లడిల్లిపోతున్న తల్లి పులి అత్యంత ప్రమాదకరంగా మారి దాడి చేస్తుందేమోననే భయం మరోవైపు…వీటి నడుమే పులి పిల్లలు అరుస్తున్న ఆర్టిఫిషీయల్‌ సౌండ్స్‌ చేస్తూ తల్లి రాక కోసం వెయిటింగ్‌. ప్రత్యేక ఎంక్లోజర్ లో పిల్లలను ఉంచి తల్లి స్పందన బట్టి పిల్లలను తల్లి వద్దకు చేర్చే ఆపరేషన్‌ ఇది. అందరిలో ఉత్కంఠను పెంచేసింది. పెద్ద పులి అడుగు జాడలున్న చోటంతా తిరిగారు. అడవిలో ఈ నాలుగు పులి పిల్లలను వదిలి పులి కూనల అరుపులతో కృత్రిమ శబ్దాలు చేస్తూ పెద్దపులిని అక్కడికి రప్పించేందుకు ప్రయత్నం చేశారు. ఇలా అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అడవిలో ఆపరేషన్‌ కొనసాగింది. తల్లి పులి జాడ కానరాలేదు. తెల్లవారాక ఎండవేడికి పులి పిల్లలు ఇబ్బందుల అవుతాయనే ఉద్దేశంతో ఆపరేషన్ టైగర్‌ T-108 నిలిపేశారు ఫారెస్ట్ అధికారులు. తర్వాత పులి పిల్లలను ఆత్మకూరులోని డీఎఫ్‌వో కార్యాలయానికి తరలించారు. అర్ధరాత్రి అడవిలో అత్యంత సాహసోపేతంగా చేపట్టిన ఆపరేషన్‌ సఫలం కాకపోవడంతో అటవీ అధికారులు తమ ముందు మిగిలి ఉన్న ఆప్షన్స్‌ను పరిశీలిస్తున్నారు.

ఒకవేళ పులి కూనలను తిరుపతి జూ లో ఉన్న ఇనిషియేటివ్‌ ఎన్‌క్లోజర్‌కి తరలించాల్సి వస్తే అవి ఎదిగాక వాటిని మళ్లీ అడవిలోకి వదిలేందుకు వేట వంటివి నేర్పిస్తామంటున్నారు అధికారులు. పులి కూనల విషయంలో NTCA(నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ) ప్రొసీజర్‌ని పాటిస్తామంటోంది ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌. ఇప్పుడు ఆ పులి పిల్లలు అడవిలోకి వెళ్లి అమ్మను కలుస్తాయా లేక తిరుపతి జూకి వెళ్లి హాస్టల్‌ పిల్లల్లా మారిపోతాయా అనేది NTCA చేతిలో ఉంది. అవి అడవి బాట పడతాయా, జూ కి పంపిస్తారా అనేదానిపై NTCA నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఈ పులి కూనల విషయంలో వీటిని తిరుపతి జూకి తరలిస్తేనే బెటర్‌ అంటూ ఆత్మకూరు డీఎఫ్‌వో కార్యాలయం NTCAకి రిపోర్ట్‌ చేసినట్టు సమాచారం. దీంతో ఈ పులికూనల తలరాతలు ఏమవుతాయో వేచి చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..