AP Assembly: ఏపీ బడ్జెట్ సమావేశాల ముహూర్తం ఖరారు.. శాసనసభకు టీడీపీ హాజరయ్యేనా?

ఆంధ్రప్రదేశ్ శాసన సభ బడ్జెట్ సమావేశాలకు రాష్ట్ర సర్కార్ సిద్ధమవుతోంది. మార్చి 7 నుంచి రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

AP Assembly: ఏపీ బడ్జెట్ సమావేశాల ముహూర్తం ఖరారు.. శాసనసభకు టీడీపీ హాజరయ్యేనా?
Ap Assembly
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 24, 2022 | 9:54 AM

Andhra Pradesh Assembly Budget Session: ఆంధ్రప్రదేశ్ శాసన సభ బడ్జెట్ సమావేశాలకు రాష్ట్ర సర్కార్ సిద్ధమవుతోంది. మార్చి 7 నుంచి రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం(AP Government) భావిస్తోంది. మార్చి నెలాఖరు వరకు సమావేశాలను నిర్వహించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 15 నుంచి 20 పనిదినాలు ఉండేలా సమావేశాలను నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. గవర్నర్(Governor) ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరంజరిగే బీఏసీ సమావేశం(BAC Meeting)లో సభా నిర్వహణ పైన నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ నెలాఖరు వరకు సమావేశాలు నిర్వహించాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల మార్చి 7న తొలిరోజు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి అకాల మృతిపట్ల అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. అనంతరం సభ వాయిదా పడనుంది. తిరిగి మార్చి 8న ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రసంగిస్తారు. ఈ దఫా బడ్జెట్ సమావేశాలు 15 20 రోజుల పాటు జరుగనున్నాయి. మార్చి 11 లేదా 14న ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

ఇక, ఈ నెల 11 లేదా 14వ తేదీన సభలో 2022-23 వార్షిక బడ్జెట్ ను సభలో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే శాఖల వారీగా ఆర్దిక మంత్రి బుగ్గన సమీక్షలు నిర్వహిస్తున్నారు. మార్చి నెలాఖరు వరకు సమావేశాలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ సమావేశాలు ప్రభుత్వానికి కీలకంగా మారనున్నాయి. త్వరలో సీఎం జగన్ తన మూడేళ్ల పాలన పూర్తి చేసుకోనున్నారు. ఇప్పటికే పాలనా పరంగా ప్రక్షాళన మొదలు పెట్టిన సీఎం జగన్ ఇక, ఈ సమావేశాల్లో కీలక బిల్లుల దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మూడేళ్ల పాలన పూర్తి కానుండటంతో… ప్రస్తుత మంత్రివర్గం సైతం ప్రక్షాళన చేయనున్నారు. తొలుత రెండున్నారేళ్లకే మంత్రివర్గంలో మార్పులు చేయాలని భావించినా.. కరోనా కారణంగా ఇబ్బందులు రావటంతో..మూడేళ్లకు మార్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావిస్తున్నట్లు సమాచారం.

కొద్ది నెలల క్రితం ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లులను ఉభయ సభల్లోనూ ఉప సంహరించుకుంది. అయితే, అదే సమయంలో మూడు రాజధానుల బిల్లులను మరింత సమగ్రంగా తిరిగి సభ ముందుకు తీసుకొస్తామంటూ సీఎం జగన్ అప్పుడే సభలో ప్రకటించారు. ఈ నిర్ణయానికి సంబంధించి న్యాయ పరమైన సమస్యలు తలెత్తకుండా… మూడు రాజధానుల బిల్లులను సిద్దం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సమావేశాల్లోనే ఈ బిల్లులను ఆమోదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది పూర్తయితే..ఇక, సీఎం జగన్ విశాఖ కేంద్రంగా తన కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది.

ఇదిలావుంటే, పాలనా పరంగా పలు కీలక నిర్ణయాలకు ఈ సారి సమావేశాలు కీలకం కానున్నాయి. రాజకీయంగానూ అనేక అంశాల పైన సభా వేదికగానే సమాధానం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు తాను తిరిగి సీఎం అయ్యే వరకూ సభలో అడుగు పెట్టనని శపధం చేశారు. దీంతో..మిగిలిన టీడీపీ సభ్యులు సభకు హాజరవుతారా..లేక, గతంలో వైసీపీ అనుసరించిన వ్యూహాన్నే అమలు చేస్తారా అనేది ఇప్పుడు కీలక చర్చగా మారింది. ఇక, ఈ సమావేశాల ద్వారా రానున్న రెండేళ్ల భవిష్యత్ ప్రణాళికలను సీఎం జగన్ సభ ద్వారా వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also….  Elephants fight: రెండు ఏనుగుల మధ్య భీకర పోరాటం.. ఎప్పుడైనా చూశారా..! నెట్టింట వైరల్‌ అవుతున్న సూపర్‌ వీడియో