Sankranti: సంక్రాంతి డిమాండ్.. ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ.. తాట తీస్తామంటూ తనిఖీలు చేస్తున్న ఆర్టీఏ..

సంక్రాంతి డిమాండ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు ప్రయాణికులను దోచుకుంటున్నాయి ప్రైవేట్‌ ట్రావెల్స్‌. టికెట్ ధరలను మూడింతలు పెంచేశాయి.

Sankranti: సంక్రాంతి డిమాండ్.. ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ.. తాట తీస్తామంటూ తనిఖీలు చేస్తున్న ఆర్టీఏ..
Private Travels

Updated on: Jan 12, 2023 | 9:59 AM

సంక్రాంతి డిమాండ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు ప్రయాణికులను దోచుకుంటున్నాయి ప్రైవేట్‌ ట్రావెల్స్‌. టికెట్ ధరలను మూడింతలు పెంచేశాయి. ఆన్‌లైన్‌ బుకింగ్‌ల పేరిట దోపిడీకి పాల్పడుతున్నాయి. రూ.1000 టికెట్‌ ధరను.. రూ. 3 వేల నుంచి రూ. 4 వేలకు పెంచేశారు. ఇక రూ. 800 లు ఉండే సాధారణ టికెట్‌ ధరను రూ. 2 వేలకు పెంచేసి ప్రయాణికులను దోచుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి సుమారు వేయ్యి ప్రైవేటు ట్రావెల్ బస్సులు నడుస్తున్నాయి. ఏపీ, కర్ణాటక సహా వివిధ ప్రాంతాలకు ప్రైవేట్ ట్రావెల్ బస్సులు నడుస్తున్నాయి. విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, శ్రీకాకుళం, బెంగళూరుకు, తిరుపతి ప్రాంతాలకు అధిక డిమాండ్ ఉంది. దాంతో రూ. 700 ఉండే టిక్కెట్ రేట్లను రూ. 2వేలకు పైగా పెంచేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ రేట్లు చూసి ప్రయాణికులు జడుసుకుంటున్నారు. విమానాల రేట్ల మాదిరిగా.. టైమ్ కౌంట్ డౌన్‌ను బట్టి రేట్లను పెంచుతున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్.

హయత్‌నగర్-విజయవాడ హైవేపై ఆర్టీఏ తనిఖీలు..

సంక్రాంతి పండు రద్దీ నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ, ఫిట్‌నెస్ లేని బస్సులను సైతం రోడ్డుకు తీసుకువస్తుండటంతో ఆర్టీఏ అధికారులు అలర్ట్ అయ్యారు. హైదరాబాద్-విజయవాడ హైవే పై తనిఖీలు చేపట్టారు. బుధవారం మొదలైన తనిఖీలు.. 2వ రోజు కూడా కొనసాగాయి. గురువారం నాడు హయత్‌నగర్-విజయవాడ హైవేపై ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్తున్న ట్రావెల్స్‌ను చెకింగ్ చేశారు. ఉదయం, రాత్రి కూడా ఈ చెకింగ్స్ జరుగుతున్నాయి. ఈ తనిఖీల్లో భాగంగా నిబంధనలు పాటించని 6 బస్సులను సీజ్‌ చేశారు అధికారులు. సరైన పత్రాలు, ఫిట్‌నెస్, ఫైర్‌సేఫ్టీ సర్టిఫికెట్లు లేని బస్సులు సీజ్‌ చేశారు. ఇప్పటికే అధిక ధరలకు టికెట్లు అమ్మకాలపై ఫోకస్‌ పెట్టి దోపిడీకి చెక్‌ పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నామంటున్న అధికారులు.. బస్సుల ఫిట్‌నెస్‌ కూడా చాలా ముఖ్యమంటున్నారు.

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఏపీ ఆర్టీఏ స్పెషల్ డ్రైవ్..

విశాఖపట్నంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. 50కి పైగా బస్సులపై కేసులు నమోదు చేశారు. రూ.1.30 లక్షల జరిమానా విధించారు. అగనంపూడి టోల్‌ ప్లాజా దగ్గర తనిఖీల్లో భాగంగా నిబంధనలు ఉల్లంఘించిన, సరైన పత్రాలు లేని బస్సుల్ని గుర్తించి ఫైన్లు వేస్తున్నారు. పండుగ సీజన్‌ క్యాష్‌ చేసుకోవడానికి నిబంధలకు విరుద్ధంగా తిప్పుతున్న ట్రావెల్స్‌పై కఠినంగా చర్యలు తీసుకుంటామని ఆర్టీఏ అధికారులు చెప్తున్నారు. ఇష్టారాజ్యంగా బస్సులు నడిపితే సీజ్‌ చేస్తామని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..