Rs 40 Lakhs Worth Money and Gold Seized: తెలంగాణలో భారీ చోరీకి పాల్పడిన దొంగలు.. ఆంధ్రాలో అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటనలో పోలీసులు నిందితుల నుంచి రూ. 35 లక్షలకు పైగా నగదుతో పాటు.. బంగారం, వెండి నగలను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం నాడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం, కృష్ణా జిల్లా నందిగామ మండలం జొన్నలగడ్డ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో మధిర నుంచి నందిగామ వైపు వెళ్తున్న ఓ కారు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు ఆ కారును ఆపి తనిఖీ చేశారు. పోలీసులు అనుమానించినట్లుగానే షాకింగ్‌గా ఆ కారులో భారీ స్థాయిలో నగదు సహా బంగారు, వెండి నగలు పట్టుబడ్డాయి. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి నుంచి రూ. 35,61,650 లక్షల నగదు, బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇంతపెద్ద మొత్తంలో డబ్బును చూసిన పోలీసులు.. నిందితులను తమదైన స్టైల్‌లో ప్రశ్నించారు. ఇంత డబ్బు ఎక్కడిది? ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అంటూ వరుస ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. దాంతో కారులోని ఇద్దరు అసలు విషయాన్ని వెల్లడించారు. ఈనెల 26వ తేదీన తెలంగాణలోని వైరాలో ద్వారకానగర్ కాలనీలోని ఓ ఇంట్లో దోచుకున్నట్లు వెల్లడించారు. ఆ తరువాత అక్కడి నుంచి పారిపోయినట్లు తెలిపారు. ఇక ఈ ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. సోమవారం నాడు వీరిని కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ ఇద్దరు నిందితులు రాజస్థాన్‌కు చెందిన దినేష్ సింగ్, ఇన్సాఫ్ మహమ్మద్ గా పోలీసులు గుర్తించారు. కాగా, ఈ దోపిడీపై వైరాలో కూడా కేసు నమోదైంది.
Also read: