AP News: ఏపీలో కూడా మహిళలకు ఫ్రీ జర్నీ..? ఎప్పటి నుంచంటే..?
కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల తరహాలో ఎపిఎస్‌ఆర్‌టిసి ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీసులు, పల్లె వెలుగు బస్సు సర్వీసుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. కర్నాటక, టీఎస్ ప్రభుత్వాలు ఈ పథకాన్ని ఎలా అమలు చేస్తున్నాయో ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది.

ఏపీ రాజకీయాలు గ్యారెంటీ పథకాల చుట్టూ తిరుగుతున్నాయి. కర్నాటక, తెలంగాణలో సక్సెస్ అయిన ఆరు గ్యారెంటీల మాదిరిగానే సూపర్ సిక్స్ స్కీమ్స్ ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు. దానిలో భాగంగా.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ఇప్పటికే సభల్లో చంద్రబాబు హామీ ఇస్తున్నారు. మహిళల ఫ్రీ జర్నీ స్కీమ్‌పై విస్తృత ప్రచారం కూడా చేసేస్తున్నారు.
మరోవైపు.. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం స్కీమ్‌పై అధికార వైసీపీ కూడా ఫోకస్ పెట్టింది. ఫ్రీ జర్నీ స్కీమ్ వైపు మహిళలు మొగ్గు చూపుతుండడంతో సీఎం జగన్.. ఆ దిశగా దృష్టించారు. ఈ విషయంలో ప్రతిపక్షానికి చాన్స్ ఇవ్వకూడదనే ఉద్దేశంతో.. అధికారంలో ఉన్న వైసీపీ ముందుగానే.. మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. సంక్రాంతి తర్వాత అమలుకు జగన్ సర్కార్ ప్రణాళికలు రచిస్తుండడం ఆసక్తి రేపుతోంది. ఈ మేరకు ఇప్పటికే సంబంధిత అధికారుల నుంచి రిపోర్ట్ తీసుకుంది. సంస్థపై ఎంత భారం పడుతుంది..? కర్నాటక, తెలంగాణలో అమలు చేశాక పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్న అంశాలపై నివేదిక ఇచ్చారు ఆర్టీసీ అధికారులు. సాధారణ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేసి, లగ్జరీ బస్సుల్లో రాయితీ ఇవ్వటంపైనా సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. నిర్ణయం తీసుకుంటే.. పురుషులు, ఆటో డ్రైవర్ల సమస్యలకు ఎలా చెక్ పెట్టాలన్న అంశంపై కూడా సమాలోచనలు చేస్తున్నారు. రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఏపీఎస్‌ఆర్టీసీ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.300 కోట్లు జీతాలు చెల్లిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 40 లక్షల మంది APSRTC బస్సుల్లో ప్రయాణిస్తుండగా, అందులో 15 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారు. ఏపీఎస్ఆర్టీసీకి రోజుకు రూ.17 కోట్ల ఆదాయం వస్తోంది.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలైతే ఏపీఎస్‌ఆర్టీసీకి రోజుకు నాలుగు కోట్ల రూపాయల ఆదాయం తగ్గుతుందని అంచనా. సంక్రాంతి కానుకగా మహిళలకు ఏపీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
ఇదిలావుంటే.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీతో రోడ్డున పడుతున్నామంటూ తెలంగాణలో ఆటోవాలాలు ఆందోళనకు దిగగా.. ఇప్పుడు ఏపీలోనూ ఎన్నికల హామీగా మారడంతో ముందుగానే అలెర్ట్ అయ్యారు ఆటో డ్రైవర్లు. ఏపీలో మహిళలకు ఫ్రీ జర్నీ స్కీమ్ వద్దంటూ ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగుతున్నారు. మహిళల ఉచిత బస్సు జర్నీ హామీ విషయంలో అన్ని పార్టీలూ ఆలోచించాలని డిమాండ్ చేస్తున్నారు. మహిళల ఫ్రీ జర్నీ హామీని వ్యతిరేకిస్తూ రేపు విశాఖలో మహా ధర్నాకు పిలుపునిచ్చారు ఆటో డ్రైవర్లు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
