Andhra news: ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన ఉద్యోగి.. వేటు వేసిన ఈసీ

|

Mar 17, 2024 | 7:23 PM

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగిపై ఈసీ వేటు వేసింది. పూర్తి డీటేల్స్ ఏంటో తెలుసుకుందాం పదండి....

Andhra news: ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన ఉద్యోగి.. వేటు వేసిన ఈసీ
Suspended
Follow us on

లోక్‌సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేయడంతో ఎన్నికల కోడ్‌ తక్షణమే అమల్లోకి వచ్చింది. అధికార యంత్రాంగం పూర్తిగా ఈసీ ఆధీనంలోకి వచ్చింది. మంత్రులు, ప్రజాప్రతినిధులకు ప్రొటోకాల్‌ వర్తించదు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, భవనాల నుంచి రాజకీయ నేతల పోస్టర్లు తొలగించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. రాజకీయ ప్రకటనల హోర్డింగ్‌లు, కటౌట్ల తొలగింపునకు ఈసీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సచివాలయ పరిసరాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాల్లో నియమావళి తప్పనిసరని స్పష్టం చేశారు. వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఈసీ అధికారులు ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన ఓ వీఆర్వోపై ఇప్పటికే వేటేశారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం దిమ్మిలి VROను సస్పెండ్‌ చేశారు. శాఖపరంగానూ ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వులు ఇచ్చారు.

మరోవైపు ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఈసీ పటిష్ట నిఘా పెట్టింది. రాష్ట్ర సరిహద్దుల దగ్గర, అన్ని జిల్లాల సరిహద్దుల దగ్గర చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే భారీగా నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. 50వేల రూపాయలు దాటితే ఆధారాలు చూపాలని ఈసీ అధికారులు స్పష్టం చేశారు. తగిన ఆధారాలు, రసీదు లేకుండా నగదు, మద్యం, బంగారం, వెండి తరలిస్తే స్వాధీనం చేసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికలను ప్రభావితం చేసేలా నగదు అక్రమరవాణా చేస్తే కఠినచర్యలు తప్పవని ఈసీ అధికారులు హెచ్చరించారు. పోలీసుల తనిఖీలు నిరంతరం కొనసాగుతాయన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మే 13న ఒకేరోజు ఎన్నికలు జరగనున్నాయి. జూన్‌ 4న ఫలితాలు వెలువడతాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..