Andhra Mirchi: ఏపీలో ప్రస్తుతం మిర్చి ధర ఎంతుంది…? జగన్ ఏమంటున్నారు..? బాబు యాక్షన్ ఎలా ఉంది..?
ఏపీలో మిర్చి ధర పతనం పొలిటికల్‌గా ఘాటెక్కిస్తోంది. అధికార, విపక్షాల విమర్శలు, ప్రతివిమర్శలతో మరింత మంట పుట్టిస్తోంది. ఇక.. వైసీపీ అధినేత జగన్.. గుంటూరు మిర్చి యార్డ్ సందర్శనతో పీక్ స్టేజ్‌కు చేరింది. అయితే సీఎం చంద్రబాబు ఇప్పటికే తన మార్క్ యాక్షన్ ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారు. ఆ డీటేల్స్ తెలుసుకుందాం...

గత సీజన్ వరకు మిర్చి ధర 21వేలకు పైగా పలికింది. అయితే.. సడెన్‌గా 13 వేలకు పడిపోవడం రైతులకు షాకిచ్చింది. అంతేకాదు క్వాలిటీ లేదంటూ కొన్ని చోట్ల తొలి కోత కాయ కూడా 10 వేలు నుంచి 12 వేలకే అడుగుతున్నారు. దాంతో మహమ్మారి తెగుళ్ల నుంచి పంటను కాపాడుకున్న మిర్చి రైతులు లబోదిబోమంటన్నారు. ధర పతనంతో ఆందోళనలకు దిగారు. ఈ క్రమంలోనే.. వైసీపీ అధినేత జగన్.. గుంటూరు మిర్చి యార్డ్‌ను సందర్శించడం కాకరేపింది. మిర్చి రైతులను పరామర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా.. మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జగన్. 13వేల ధరతో మిరప రైతులకు పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి నెలకొందన్నారు. వెంటనే పంటలకు మద్దతు ధరలు కల్పించాలని.. లేనిపక్షంలో రైతుల తరపున పోరాటాలకు దిగుతామని జగన్ హెచ్చరించారు.
ఇక.. రైతుల ఆందోళనలతో మిర్చి ధరలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. మిర్చి రైతులను ఆదుకోవాలంటూ కేంద్రానికి లేఖ రాశారు. ధరల స్థిరీకరణ నిధి కింద రేటు పెంచాలని విజ్ఞప్తి చేశారు. వర్షాల కారణంగా ఏపీలో మిర్చి పంటలు దెబ్బతిన్నాయని.. మిర్చి రైతుల సమస్యను ప్రత్యేక కేసుగా గుర్తించాలని కేంద్రాన్ని కోరారు. అలాగే.. రేపటి ఢిల్లీ పర్యటనలో మిర్చి రైతుల ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
మరోవైపు.. మిర్చి రైతుల విషయంలో జగన్ కామెంట్స్‌పై ఏపీ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు రియాక్ట్ అయ్యారు. జగన్ తీరు కరెక్ట్ కాదని.. మిర్చికి మద్దతు ధర పెడితే అంతకుమించి రేటు పలకదని గుర్తుంచుకోవాలన్నారు. మిర్చి రైతుకు ఎక్కువ మేలు చేయాలనేదే తమ ప్రయత్నమని.. కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు చేస్తున్నామని అచ్చెన్నాయుడు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




