
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్ట్‌తో ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును పరామర్శించిన తర్వాత జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో కలిసి పోరాడతామని, బీజేపీ కూడా కలిసి వస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇకపై టీడీపీతో కలిసి ఉమ్మడి పోరాటం చేస్తామని తేల్చేశారు పవన్. అయితే పవన్ ప్రకటనపై ఏపీ బీజేపీ ఆచితూచి స్పందించింది. జనసేనతో తమ పొత్తు కొనసాగుతోందని, మిగతా పొత్తులపై కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుందని స్పష్టం చేసింది. ప్రాంతీయ పార్టీలు స్థానికంగా నిర్ణయించవచ్చని జాతీయ పార్టీల నిర్ణయం ఢిల్లీ నుంచే రావాలని ఏపీ బీజేపీ నేతలు క్లారిటీ ఇచ్చారు.
ఇక ఏపీ బీజేపీ నేతల అభిప్రాయాల విషయానికి వస్తే.. — ఏపీలో పొత్తుల విషయం హైకమాండ్ ఇష్టం అన్నారు ఏపీ బీజేపీ మీడియా ఇంచార్జ్ పాతూరి నాగభూషణం. ఇది రాష్ట్ర స్థాయిలో తేల్చే వ్యవహారం కాదని.. ప్రస్తుతానికి జనసేనతో స్నేహబంధం కొనసాగుతుందన్నారు. పొత్తులు, మార్పులు ఉంటే అధిష్టానమే చెబుతుందని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి వెళ్తాయని, బీజేపీ కూడా కలిసివస్తుందన్న పవన్ కళ్యాణ్ ప్రకటనను ఏపీ బీజేపీ నేత ఆది నారాయణ రెడ్డి స్వాగతించారు. మూడు పార్టీలూ కలిసి వెళ్లాలనేది తన కోరిక కూడా అని చెప్పారాయన. ఇప్పటికే పొత్తులపై పవన్ బీజేపీ కేంద్ర నాయకత్వంతో మాట్లాడారని, త్వరలోనే ప్రకటన ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఆదినారాయణ రెడ్డి.
పొత్తులపై పవన్ ప్రకటనతో టీడీపీలోనూ జోష్ వచ్చేసింది. టీడీపీ జనసేన పొత్తు చరిత్రాత్మక నిర్ణయమని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. వైసీపీని గద్దె దించేందుకు సివిల్ వార్ ప్రకటిస్తున్నామన్నారు. మొత్తంగా ఏపీలో 2014 కాంబినేషన్ రిపీట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వైసీపీకి వ్యతిరేకంగా జట్టు కట్టబోతున్న సంకేతాలు స్పష్టంగా అందుతున్నాయి. పొత్తులపై బీజేపీ కేంద్ర నాయకత్వ అధికారిక ప్రకటన రావడమే మిగిలింది. 2024లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వైసీపీని ఓడించగలవా? ఓటు చీలకుండా చూస్తే వైసీపీని ఓడించేందుకు అవకాశాలున్నాయని టీడీపీ, జనసేన వర్గాలు భావిస్తున్నాయి. పవన్ ఇదే విషయాన్ని అనేకసార్లు చెప్పారు.
అటు వైసీపీ మాత్రం పొత్తు ఇప్పుడు కొత్త ఏముంది.. ఈరోజుతో ముసుగు తొలగింది అని చెబుతుంది. చంద్రబాబు ఆలోచనలు పవన్ ఎప్పట్నుంచో అమలు చేస్తున్నారని ఆరోపించింది. 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిక కోసమే పవన్ వేరుగా పోటీ చేశాడని ఆ పార్టీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..