Andhra: ఇదేదో రోడ్డు పక్కన ఉన్న సాధారణ బండ రాయి అనుకునేరు.. దాని వెనుక..

చరిత్రకు కేరాఫ్ అడ్రస్‌గా పేరొందిన అద్దంకిలో, అరుదైన కాకతీయుల కాలం నాటి గాడిద శాసనం అధికారుల నిర్లక్ష్యంతో భూమిలోనే మగ్గిపోతోంది. 2016లో రోడ్డు విస్తరణ సమయంలో వెలుగుచూసిన ఈ చారిత్రక శిలాశాసనాన్ని తవ్వకాలు జరిపి వెలికి తీయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Andhra: ఇదేదో రోడ్డు పక్కన ఉన్న సాధారణ బండ రాయి అనుకునేరు.. దాని వెనుక..
Ancient Stone Inscription

Edited By:

Updated on: Jan 26, 2026 | 1:48 PM

చరిత్రకు కేరాఫ్ అడ్రస్ అద్దంకి.. కానీ ఇక్కడ చారిత్రక కట్టడాలు, శాసనాలు అధికారుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యాలుగా మారుతున్నాయి. అద్దంకి నార్కెట్ పల్లి రోడ్డు నిర్మాణ సమయంలో వెలుగుచూసిన ఒక అరుదైన గాడిద శాసనం అధికారుల ఉదాసీనత వల్ల నేడు భూమిలోనే మగ్గిపోతోంది. కాకతీయుల వైభవానికి ప్రతీకగా నిలిచే ఈ శాసనాన్ని వెలికితీయాలన్న డిమాండ్ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.

2016వ సంవత్సరంలో అద్దంకి – నార్కెట్ పల్లి రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న సమయంలో ఈ పురాతన శిలా శాసనం బయటపడింది. పట్టణంలోని వేయి స్తంభాల గుడి (నాగేశ్వరస్వామి ఆలయం) నాట్య గణపతి ఆలయాల సమీపంలో ఉన్న ఈ శాసనంపై గాడిద గుర్తు ఉండటంతో దీనిని గాడిద శాసనంగా పిలుస్తారు. అయితే, అప్పట్లో మున్సిపల్ అధికారులు, కాంట్రాక్టర్లు దీని విలువను గుర్తించకుండా, కేవలం ఒక రాయిగా భావించి దానిపై మట్టిపోసి పూడ్చివేశారు. ఏకంగా చారిత్రక సంపదపైనే రోడ్డు నిర్మించి నిర్లక్ష్యాన్ని చాటుకున్నారు.

క్రీస్తుపూర్వం శాసనం – పురావస్తు శాస్త్ర విశ్లేషకులు జ్యోతి చంద్రమౌళి

అద్దంకి ప్రాంతానికి క్రీస్తుపూర్వం 10వ శతాబ్దం నుంచే గొప్ప చరిత్ర ఉందని పురావస్తుశాస్త్ర విశ్లేషకులు జ్యోతి చంద్రమౌళి చెబుతున్నారు. కాకతీయుల కాలంలో వేయించిన ఈ గాడిద శాసనం ఆనాటి శాసన ఉల్లంఘనలకు సంబంధించిన హెచ్చరికలను తెలియజేస్తుంది. 2016లో ఇది బయటపడినప్పుడే దీనిని భద్రపరచాల్సి ఉంది. కానీ రోడ్డు పనుల పేరుతో దీనిని భూస్థాపితం చేయడం అత్యంత బాధాకరం. ఇప్పటికైనా ప్రభుత్వం, పురావస్తు శాఖ స్పందించి తవ్వకాలు జరిపి ఈ శాసనాన్ని బయటకు తీయాలి. దాదాపు 1970ల వరకు భూమిపై మూడు అడుగుల ఎత్తులో స్పష్టంగా కనిపించిన ఈ శాసనం, నేడు అధికారుల అనాలోచిత నిర్ణయాల వల్ల మరుగున పడిపోయింది. అద్దంకి చరిత్రను ప్రపంచానికి చాటిచెప్పే ఇటువంటి ఆధారాలను నిర్లక్ష్యం చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఆ రోడ్డు కింద ఉన్న శాసనాన్ని వెలికి తీసి ఏదైనా మ్యూజియంలో కానీ ఆలయ ప్రాంగణం లో కానీ భద్రపరచాలని కోరుతున్నారు

మట్టిలో కలిసిపోతున్న మన చరిత్రను కాపాడు కోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది… మరి ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారా…? చారిత్రక శాసనాన్ని వెలికి తీస్తారా…? వేచి చూడాలి.