Anantapur: పొద్దున్న ముగ్గురిపై దాడి చేసి గాయపరిచింది.. సాయంత్రం అయ్యేసరికి ఇలా..

అనంతపురం జిల్లా నార్పల మండలం బొందలవాడలో చిరుత దాడి అంటూ కలకలం రేగింది. ముగ్గురిపై దాడి జరగడంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే అటవీశాఖ దర్యాప్తులో దాడులు చేసినది చిరుత కాదని, అడవి పిల్లి అని నిర్ధారణకు వచ్చింది. గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

Anantapur: పొద్దున్న ముగ్గురిపై దాడి చేసి గాయపరిచింది.. సాయంత్రం అయ్యేసరికి ఇలా..
Wild Cat Attack

Edited By:

Updated on: Feb 02, 2026 | 7:32 PM

అనంతపురం జిల్లా నార్పల మండలం బొందలవాడలో చిరుత సంచారం ఉందన్న సమాచారంతో గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది. పొలం పనులకు వెళ్లిన ఆదిలక్ష్మమ్మ అనే వృద్ధురాలిపై తొలుత దాడి జరిగింది. అనంతరం కాసేపటికే కోణంకి నాయుడు అనే వ్యక్తిపై కూడా దాడి జరిగింది. ఈ ఘటనల్లో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని గ్రామస్తులు ఆసుపత్రికి తరలించారు. ఇదే సమయంలో మధ్యాహ్నం మరో వ్యక్తిపై కూడా దాడి జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. వరుస దాడులతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. గ్రామస్తులు ఇళ్లలోంచి బయటకు రావడానికి కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే గ్రామానికి చేరుకున్నారు. అత్యవసరమైతే తప్ప ఎవ్వరూ ఇళ్లలోంచి బయటకు రావద్దని, అవసరమైతే గుంపులుగా మాత్రమే వెళ్లాలని మైక్ ద్వారా ప్రచారం చేశారు. అలాగే పొలం పనులకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ముగ్గురిపై దాడి జరిగిన నేపథ్యంలో బొందలవాడ శివారు పొలాల్లో అటవీశాఖ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో అక్కడ ఒక జంతువు మృతదేహాన్ని గుర్తించారు. దగ్గరగా పరిశీలించగా అది చిరుత కాదని, అడవి పిల్లి అని అధికారులు నిర్ధారించారు. పాదముద్రల ఆధారంగా కూడా చిరుత సంచారం జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. పొలం పనులకు వెళ్లిన వారిపై దాడి చేసింది చిరుత కాదు, అడవి పిల్లియేనని ప్రాథమికంగా అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. అయితే ముగ్గురిపై దాడి చేసిన అడవి పిల్లి బొందలవాడ శివారు పంట పొలాల్లో నెత్తురు కక్కుతూ మృతి చెందడం అనుమానాస్పదంగా మారడంతో, దాని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. దీంతో చిరుత భయం తొలగిపోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 

Loading...
Unable to load recommendations.
Follow Us