ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి సీఎం జగన్ లేఖ రాశారు. విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా, ఐదేళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. విభజన తరువాత ఏపీ అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని .. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతో ప్రజలకు అన్యాయం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. 14వ ఆర్థిక సంఘం రిపోర్ట్‌లో హోదాపై ప్రస్తావన లేదని.. అయినా దానికి సాకుగా చూపుతున్నారని జగన్ లేఖలో తెలిపారు. ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 15వ ఆర్థిక సంఘం నివేదిక హోదా అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందని తేల్చిందని తెలిపిన జగన్.. ఈ విషయంలో మీరే చొరవ తీసుకొని ఏపీ ప్రజలకు న్యాయం చేయాలని జగన్ కోరారు. హోదాతో పాటు ఏపీ అభివృద్ధి కోసం నిధులు కూడా ఇవ్వాలని ఆయన లేఖలో వెల్లడించారు.
అయితే ఏపీకి హోదా ఇవ్వడం కుదరదని కేంద్రం పార్లమెంట్ సాక్షి పలుమార్లు స్పష్టం చేసింది. అలాగే మంగళవారం జరిగిన పార్లమెంట్ సమావేశాల్లోనూ ఏపీకి హోదా ఇవ్వడం కుదరదని కేంద్రమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యయమని.. ఏపీకి హెదా అవసరం లేదని 14వ ఆర్ధిక సంఘం కూడా చెప్పిందని ఆయన అన్నారు. ఆ సమాధానం ఇచ్చి కొన్ని గంటలు కూడా గడవకముందే జగన్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం గమనర్హం. ఇదిలా ఉంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను గెలిస్తే ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొస్తానని జగన్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.