రౌడీ షీటర్ దాడిలో బ్రెయిన్ డెడ్‌కు గురైన యువతి సహానా.. జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. నిందితుడు, రౌడీ షీటర్ నవీన్‌ను గుంటూరు జిల్లా తెనాలి పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించే విషయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తిందని చెబుతున్నారు పోలీసులు. సహానాను తలను కారు డ్యాష్ బోర్డు కేసికొట్టడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయన్నారు. నిందితుడు నవీన్‌కు ఏ పార్టీ నేతలతో సంబంధం లేదని పోలీసులు స్పష్టం చేశారు.
తెనాలికి చెందిన సహానాను.. ఈ నెల 19న నవీన్ అనే రౌడీ షీటర్ కారులో తీసుకెళ్లాడు. కొన్ని గంటల తర్వాత ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి నవీన్ పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు.. బాధితురాలిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ సహానా మృతి చెందింది. జీజీహెచ్‌లో బాధిత కుటుంబాన్ని వైసీపీ నేతలు పరామర్శించారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆ పార్టీ నేతలు ఆరోపించారు.
నిందితుడికి ఏపార్టీ నేతలతో సంబంధం లేదని పోలీసులు చెబుతున్నా.. వైసీపీ మాత్రం రాజకీయ లబ్దికోసం తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడుతున్నారు..టీడీపీ నేతలు. వైసీపీ హయాంలో మహిళలపై అఘాయిత్యాలు జరిగితే జగన్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు.. హోంమంత్రి అనిత. గతంలో నేరం జరిగితే 6 నెలలు దాటినా నిందితులు దొరికేవారు కాదని..ఇప్పుడు ఘటన జరిగిన 24 గంటల్లో నిందితులను పట్టుకుంటున్నామని చెప్పారు.
జగన్ పాలనలో గాడి తప్పిన వ్యవస్థలను తమ ప్రభుత్వం తిరిగి గాడిలోకి తీసుకువస్తోందని చెప్పారు అనిత.. వైసీపీ నేతల తప్పుడు ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని.. ప్రజలకే తాము జవాబుదారితనంగా ఉంటామని చెప్పారు. వైసీపీ అధినేత ఇప్పటికైనా శవరాజకీయాలు మానుకోవాలని సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..