ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి మూడు నెలలు గడిచింది. మొదటిసారి సీఎంగా బాధ్యతలు తీసుకున్న జగన్.. పరిపాలనలో తనదైన ముద్రను వేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఎవరినీ పట్టించుకోకుండా ముఖ్యమంత్రి ముక్కుసూటిగా పరిపాలన చేస్తున్నారు. ఇన్ని రోజులు ఓ వైపు కేంద్రం, మరోవైపు రాష్ట్రంలోని నాయకులు ఎన్ని విమర్శలు చేస్తున్నా.. వాటికి కౌంటర్ కాదు కదా.. కనీసం స్పందించడం కూడా లేదు. కేవలం ఎమ్మెల్యేలు, మంత్రులు మాత్రమే ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతున్నారు.
అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఏపీ రాజధానిపై వివాదం మొదలైంది. ఏపీ రాజధానిని అమరావతి నుంచి మార్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న పుకారు షికారు చేసింది. దీనికి కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన కామెంట్లు కూడా తోడయ్యాయి. దీంతో రోజు రోజుకు అమరావతి వివాదం ఎక్కువవుతోంది. దీనిపై కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చినా.. రాజధాని విషయంలో జగన్ ఎందుకు సైలెంట్‌గా ఉన్నారో తెలియక ప్రజలు తికమకపడుతున్నారు. ఈ అనిశ్చిత పరిస్థితి ఎంతకాలం కొనసాగుతుందోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇక మరోవైపు ఈ విషయంపై మంత్రి బొత్స మాత్రమే మాట్లాడుతుండటం.. అది కూడా రోజుకో మాట మాట్లాడుతుండటంతో ప్రజలు అయోమయంలో ఉన్నారు. ఇదే ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు ప్రతిపక్షాలకు కీ పాయింట్‌గా మారగా.. వారు కూడా జగన్‌ను నిలదీస్తున్నారు. ప్రభుత్వం ఏ అంశంపైనైనా స్పష్టమైన వైఖరితో ముందుకు వెళ్లాలి. అది కాకుండా రాష్ట్రానికి ముఖ్యమైన రాజధాని అమరావతి విషయంలో స్పష్టమైన ప్రకటన చేయాల్సిన సమయంలో డొంకతిరుగుడు ధోరణి ఎందుకని విపక్షాలు నిలదీస్తున్నాయి.
మరోవైపు ఈ గందరగోళంతో రాజధాని అమరావతిలో రియల్ ఎస్టేట్ పడిపోయింది. రోడ్ల నిర్మాణాలు, ఇతర పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కొత్త కంపెనీలు రావడానికి ఆసక్తి చూపించట్లేదు. ఇలాగైతే కొత్త ఉద్యోగాలు ఎలా వస్తాయన్న ప్రశ్న అందరిలో తలెత్తుతోంది. ఖజానాకు ఆదాయం రావాలన్నా, యువతకు ఉపాధి లభించాలన్నా రాజధాని నిర్మాణం తప్పనిసరి. అది పూర్తైతేనే కంపెనీలు కూడా ఏపీ వైపు చూస్తాయి. లేదంటే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఎలాగూ ఉన్నాయి కాబట్టి వారికి ఏపీ వైపు రావాల్సిన అవసరం లేదు. ఇలాంటి సమయంలో జగన్ మౌనాన్ని కచ్చితంగా వీడాల్సిందే. రాజధానిపై స్పష్టత ఇవ్వాల్సిందే. మరి ఈ విషయంలో జగన్ మౌనం వెనుక కారణమేంటి..? మంత్రుల మాటల వెనుక మర్మం ఏమిటి..? నమ్మి ఓటేసిన ప్రజలకు జగన్ ఏం చేయాలనుకుంటున్నారు..? అసలు ఏపీ భవిష్యత్ ఏంటి..? ఈ విషయాలన్నింటికీ సమాధాానాన్ని కాలం చెప్పాల్సిందే.