Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu: ప్రారంభమైన టీడీపీ అధినేత చంద్రబాబు 36 గంటల నిరసన దీక్ష

తమ పార్టీ కార్యాలయాలపై దాడులను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇవాళ 36 గంటల నిరసన దీక్షకు కూర్చోబోతున్నారు.

Chandrababu: ప్రారంభమైన టీడీపీ అధినేత చంద్రబాబు 36 గంటల నిరసన దీక్ష
Chandrababu Protest
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 21, 2021 | 8:41 AM

TDP Chief Chandrababu Protest: తమ పార్టీ కార్యాలయాలపై దాడులను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు 36 గంటల నిరసన దీక్ష చేపట్టారు. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి రేపు రాత్రి 8 గంటల వరకు చంద్రబాబు నిరసన దీక్ష కొనసాగుతోంది. మంగళగిరి టీడీపీ ఆఫీస్‌లో చంద్రబాబు నిరసన దీక్షకు కూర్చున్నారు. కాగా, నిరసన దీక్షలో చంద్రబాబుతో పాటు నారా లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య, మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, ఆలపాటి రాజా, ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, గద్దే రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

తమ పార్టీ కార్యాలయాలమీద దాడులకు సంబంధించి  ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రికి చంద్రబాబు లేఖలు రాసిన సంగతి తెలిసిందే. అంతేకాదు, టీడీపీ కార్యాలయాలపై దాడుల మీద సీబీఐ విచారణ జరిపించాలని కూడా చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఫిర్యాదు చేసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ కోరిన చంద్రబాబు.. శనివారం ఢిల్లీ వెళ్లి.. దాడులపై ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.

ఇలా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో రాక్షసగణం రాజ్యమేలుతోందని, ప్రజాస్వామ్యం ఖూనీ చేయబడుతోందని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు చంద్రబాబు నిన్న విడివిడిగా లేఖలు రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు దాడులు చేయడంపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఏపీలో తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని, కేంద్ర బలగాలతో ప్రతిపక్ష పార్టీ నాయకులకు, పార్టీ కార్యాలయాలకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, డ్రగ్స్ మాఫియా అరాచకాల గురించి ప్రశ్నించారనే కారణంతో.. టీడీపీ నేతలపై, టీడీపీ కేంద్ర కార్యాలయం సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ ఆఫీసులపై దాడులు చేశారని లేఖలో పేర్కొన్నారు.

వైసీపీ శ్రేణుల దాడులకు సంబంధించిన ఫోటోలు, ధ్వంసమైన పార్టీ కార్యాలయ దృశ్యాలు, దాడుల్లో గాయపడిన టీడీపీ నేతల ఫోటోలు, పేపర్ క్లిప్పింగ్స్, వీడియోలు ఆ లేఖకు అటాచ్ చేసి పంపారు చంద్రబాబు. వీటిని పరిశీలించి.. రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రికి విజ్ఞప్తి చేశారు. వైసీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏపీలో రాజ్యాంగబద్ధ సంస్థలు, ప్రభుత్వ వ్యవస్థలు, న్యాయ వ్యవస్థ, మీడియా, రాజకీయ పార్టీలు ఇలా అన్నింటిపై దాడులకు తెగపడుతున్నారంటూ లేఖలో ఆరోపించారు. ఈ దాడులను సీరియస్‌గా పరిగణించి.. తక్షణమే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు తన లేఖలో కోరారు.

Read also: Yadadri: అద్భుత ఆధ్యాత్మిక నగర రూపకల్పనకు చకచకా ఏర్పాట్లు.. యాదాద్రి భక్తులకోసం ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మాణాలు