నిరసన చాలా రకాలుగా ఉంటుంది. ఎవరికి తగ్గ రీతిలో వాళ్లు తమ ఆగ్రహాన్ని, ఆవేదనను తెలుపుతూ ఉంటారు. తాజాగా ఏపీలో మూడు రాజధానులు ఫార్ములాకు ఏపీ ప్రభుత్వం జై కొట్టడంతో..ఇప్పటివరకు రాజధానిగా కొనసాగిన అమరావతి రైతులు గత 46 రోజులుగా నిరసనను తెలుపుతున్నారు. ఉమ్మడి కార్యచరణను సిద్దం చేసుకొని..రోజుకోరకంగా ఆందోళనల్లో పాల్గొంటున్నారు. తాజాగా కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పొన్నవరం గ్రామానికి చెందిన యువకుడు జాస్తి సురేశ్ వెరైటీగా నిరసనను తెలిపాడు. తన వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డుపై సేవ్ అమరావతి-సేవ్ ఫార్మర్స్ అని ప్రచురించి అందరికి పంచిపెట్టాడు.
పుట్టింది, పెరిగింది వ్యవసాయ కుటుంబంలోనే అన్న సురేశ్..తన తండ్రి పడ్డ కష్టాన్ని చెప్పేందుకే ఈ తరహా నిరసనను ప్రదర్శించినట్టు పేర్కొన్నాడు. సురేశ్ ప్రస్తుతం కెనడాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల తన ప్రెండ్స్‌తో కలిసి అమరావతి ఆందోళనల్లో పాల్గొన్నాడు. తన ఎంగేజ్‌మెంట్ రోజున రైతులెవరూ కనీసం భోజనం చెయ్యడానికి కూడా రాలేదని, అందరూ ఆవేదనలో ఉన్నారని అతడు వాపోయాడు.