టీడీపీ అధ్యక్షులు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు పై ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీ వాణి విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ చేపట్టే కార్యక్రమాలపై బురద జల్లే ప్రయత్నం మానుకోవాలని అన్నారు. ఆశావర్కర్లపై చేసిన ట్వీట్‌ను చంద్రబాబు తొలగించారని, దీనిని బట్టి అది ప్రభుత్వం పై బురదజల్లే ప్రయత్నమని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. 2014 ఎన్నికల సమయంలో 600 హామీలు ఇచ్చి చంద్రబాబు గెలిచారని.. కాని ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఐదేళ్ల పాటు ప్రజలను మభ్యపెట్టారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచే మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని సీఎం జగన్ అమలు చేస్తున్నారని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేపడుతున్నామని ఆమె చెప్పారు.