సొంత పార్టీ అయినా, వేరే పార్టీ అయినా..మరేవిషయమైనా సరే..తన మనసులో ఉన్న భావాన్ని ఎటువంటి బెరుకు లేకుండా బయట పెట్టేస్తుంటారు టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి. తాజాగా ఆయన సీఎం జగన్ పాలనపై స్పందించారు. తన పాలనలో అవినీతి జరగకుండా జగన్ ముక్కుసూటిగా వ్యవహరిస్తున్నారని..దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో చాలామంది ఆకలితో ఉన్నారని వ్యాఖ్యానించారు. వీరిని ఎల్లకాలం సీఎం నియంత్రించగల్గుతాడా? లేదా? అనేదే ప్రధాన విషయమని ఆయన ఆరోపించారు. ఇంత తక్కువ టైంలో పాలనపై ఒక అభిప్రాయానికి రాలేమని..కొంత కాలం వేచిచూడాలని ఆయన చెప్పారు.
ఇక బీజేపీ పార్టీ నుంచి ఆహ్వనం విషయంపై కూడా జేసీ స్పందించారు. బీజేపీలో అమిత్ షాకు సన్నిహితంగా ఉండే కొందరు నేతలు తమను సంప్రదించిన విషయం వాస్తవమే అని అంగీకరించిన జేసీ… పార్టీ మారే విషయంలో తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. కేంద్రం ఆలోచిస్తున్న జమిలి ఎన్నికలను వ్యక్తిగతంగా తాను సమర్థిస్తానని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.