
అమరావతి, నవంబర్ 14: బంగారు, వెండి ఆభరణాలను దొంగతనం చేయడం ఒకప్పటి పద్దతి. ఇప్పడు మాత్రం ఏది దొరికితే దాన్ని దొంగలించడం అందినకాడికి అమ్ముకోవడం: నయా ట్రెండ్.. ఇందుకు ఐరన్ పైపులు, ట్రాన్స్ ఫార్మర్ల కాపర్ వైర్లు.. స్మశాన వాటికల్లో ఐరన్ గ్రిల్స్ ఇవేవి కావు చోరికి అనర్హం అంటున్నారు రాజధాని దొంగలు. కొద్ది కాలం క్రితం తాడేపల్లి పరిసర ప్రాంతాల్లోని స్మశాన వాటికలు దొంగల పేరు చెబితేనే గడగడలాడిపోయాయి. ఎందుకంటే మృత దేహాలను కాల్చడానికి ఉపయోగించే దహన వాటికల్లోని ఐరన్ రాడ్డులను దొంగలించి అమ్ముకున్నారు. ఆతర్వాత పొలాల్లోని మోటార్లను గుట్టుచప్పుడు కాకుండా పట్టుకెళ్లారు. ఇది ఇలా ఉండగానే రాజధాని అమరావతిలో సరికొత్త దొంగతనాలు వెలుగు చూశాయి. ఎవరు చేస్తున్నారో? ఎందుకు చేస్తున్నారో? అర్ధం కాక కొద్దీ రోజుల పాటు పోలీసులు కూడా తలలు పట్టుకున్నారు.
అమరావతి రాజధాని నిర్మాణంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద ఐరన్ పైపులను అండర్ గ్రౌండ్‌లో వేసేందుకు తరలించారు. అయితే నిర్మాణ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో కొన్ని నిర్మాణ కంపెనీలు ఐరన్ పైపులు, స్టీల్ వస్తువులను రాజధాని ప్రాంతం నుంచి తరలించాయి. మరికొన్ని కంపెనీలు మాత్రం అక్కడే వదిలేశాయి. వీటిపైనే నయా దొంగలు కన్నేశారు. నిర్మాణ పనులు ఆపివేయడంతో పెద్ద పెద్ద ఐరన్ పైపుల చుట్టు పిచ్చి మొక్కలు మొలిచాయి. దీన్నే ఆసరగా చేసుకొని ఒక ముఠా ఏకంగా ఈ ఐరన్ పైపులను ముక్కలుగా కట్ చేసి అక్కడ నుండి స్ర్కాప్ కొనుగోలు దారులకు ఏకంగా అమ్మేసుకుంటున్నారు. ఈ విషయం కొద్దీ కాలం క్రితమే పోలీసులు దృష్టికి వచ్చింది. అయితే పోలీసులు నిఘా పెట్టిన దొంగలు మాత్రం చిక్కలేదు. ఎందుకు పిచ్చి మొక్కల మధ్యలో ఎవరూ గుర్తించకపోవడంతో వీరి ఆటలు సాగాయి.
అయితే పోలీసులు మాత్రం దొంగలను పట్టుకునేందకు ప్రత్యేకంగా నిఘా ఉంచారు. ఈక్రమంలోనే కొలను కొండకు చెందిన క్రిష్ణా రావు, చిలుమూరుకు చెందిన ఫిరోజ్, బారిరెడ్డి రామిరెడ్డిలు పోలీసులకు దొరికిపోయారు. రాజధానిలోని పెద్ద పెద్ద ఐరన్ పైపులను గ్యాస్ కట్టర్ సాయంతో కట్ చేసి, ఆ ఐరన్ షీట్స్ ను స్క్రాప్ కింద అమ్మేస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు. వీరివద్ద నుండి రెండు ఆక్సిజన్ సిలెండర్లు, ఒక డొమెస్టిక్ గ్యాస్ సిలెండర్, గ్యాస్ కట్టర్లను తో పాటు ఐరన్ షీట్లను స్వాధీనం చేసుకున్నారు. స్క్రాఫ్ అమ్మగా వచ్చిన మూడు లక్షల తొంబై వేల రూపాయలను సీజ్ చేశారు. ఈ ముఠాలో మరో ముగ్గురు ఉన్నట్లు తుళ్లూరు సిఐ ఆనంద్ బాబు తెలిపారు. రాజధానిలో మెటీరియల్ దొంగతనాలకు పాల్పడే వారిపట్ల కఠినంగా వ్యవమరిస్తామని ఇటువంటి స్క్రాప్ కొనే విషయంలో కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలని లేకుంటే వారిపై కూడా కేసులు పెడతామని హెచ్చరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.