రంగంలోకి మరో టీమ్.. కచ్చులూరు కథ ఇంకెన్నాళ్లు..?
రెండవ సారి ఆపరేషన్ చేపట్టిన తర్వాత రాయల్ వశిష్ట బోటు వెలికితీత పనులు ఐదవ రోజు కూడా కొనసాగుతున్నాయి. రాయల్ వశిష్ట బోటును బయటకు తీసేదెవరు..? బోటుకు తాడు కట్టి ఒడ్డుకు చేర్చే మొనగాడెవరు..? అన్న ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. బోటు వెలికితీత పనులు మూడు అడుగులు ముందుకి.. నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతున్నాయి. సుమారు 34 రోజుల నుంచి ఈ డ్రామా సాగుతూ వస్తోంది. అసలు ఇప్పటికైనా బోటును వెలికితీస్తారా..? అని బాధితుల కుటుంబాలు […]
రెండవ సారి ఆపరేషన్ చేపట్టిన తర్వాత రాయల్ వశిష్ట బోటు వెలికితీత పనులు ఐదవ రోజు కూడా కొనసాగుతున్నాయి. రాయల్ వశిష్ట బోటును బయటకు తీసేదెవరు..? బోటుకు తాడు కట్టి ఒడ్డుకు చేర్చే మొనగాడెవరు..? అన్న ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. బోటు వెలికితీత పనులు మూడు అడుగులు ముందుకి.. నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతున్నాయి. సుమారు 34 రోజుల నుంచి ఈ డ్రామా సాగుతూ వస్తోంది. అసలు ఇప్పటికైనా బోటును వెలికితీస్తారా..? అని బాధితుల కుటుంబాలు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నాయి. ఇక బోటును బయటకు తీసే ప్రయత్నంలో ధర్మాడి సత్యం టీం పూర్తిగా విఫలమైందని తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ అధికారులు వేరే టీం కోసం గాలిస్తున్నట్లు సమాచారం. తాజాగా కాకినాడ నుంచి ఓ టీం రానుందని.. బోటును ఎలాగైనా వెలికితీస్తుందని కొందరు చెబుతున్నారు. మరోవైపు తామే బోటును ఎలాగైనా బయటకు తీస్తామని ధర్మాడి టీం సవాల్ చేస్తోంది.
ఇన్ని రోజులుగా చేసిన ప్రయత్నంలో బోటుకు లంగర్ తగిలినా.. ఊడొచ్చిన రౌలింగ్‌తో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఇప్పుడు మళ్లీ లంగర్ తగిలితే తప్ప బోటు బయటికి వచ్చే అవకాశం కనిపించడం లేదు. అందుకే ధర్మాడి సత్యం టీం దుబాసీల కోసం విశాఖకు వెళుతున్నట్లు సమాచారం. దుబాసీలు నీటిలో దిగి రోప్‌ను కడితేనే తప్ప బోటు బయటకు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే రోప్‌ను కట్టేందుకు దుబాసీలు నో చెబుతున్నట్లు సమాచారం. ఇప్పటివరకూ చేసిన ప్రయత్నాల వల్ల 300 అడుగుల లోతులో ఉన్న బోటు.. 250 అడుగుల వరకు పైకి వచ్చిందని.. ప్రస్తుతం ఒడ్డుకు 50 అడుగుల లోతులో ఉందని ధర్మాడి సత్యం టీం చెబుతోంది. మరోవైపు బోటు మునిగి ఉన్న ప్రాంతం అంతా దుర్వాసనతో నిండిపోయింది. సెప్టెంబర్ 15న గోదావరిలో రాయల్ వశిష్ట బోటు మునగడంతో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన ఎంతోమంది కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఇప్పటికీ 13 కుటుంబాలు గల్లంతైన తమ వారి కోసం ఎదురు చూస్తూనే ఉన్నాయి. మరోవైపు సత్యం టీమ్ ఆపరేషన్ సక్సస్ కాదన్న సంకేతాలు అందుతున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఆపరేషన్ వశిష్ట కథ ముగిసినట్లేనా..? ఇన్ని రోజులుగా చేసిన ప్రయత్నం బూడిద పాలేనా..? అన్న సందేహాలు అందరిలో మెదులుతున్నాయి.