అమరావతి : ఆంధ్రప్రదేశ్ రైతులకు రైతు రుణమాఫీ పథకం కింద నాలుగో విడత నిధులను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. 4వ విడత రుణమాఫీ కోసం రూ.3,900 కోట్లు విడుదల చేసింది. 30 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 39 వేల చొప్పున జమ కానుంది. దీనికి సంబంధించి వివరాలను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు వెల్లడించారు. రైతులు వారి రుణ అర్హత, గుర్తింపు పత్రంతో బ్యాంకుకు వెళ్లాలని సూచించారు. ఏడాదికి 10శాతం వడ్డీతో సహా రైతు రుణమాఫీ పూర్తిగా చెల్లిస్తామని ప్రకటించారు. ఎన్నికల ఫలితాల కంటే ముందే.. వడ్డీతో సహా తుది విడత బకాయిలు చెల్లిస్తామని స్పష్టం చేశారు. రుణమాఫీపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. మరోవైపు పసుపు-కుంకుమ 3 విడత చెక్కు సొమ్మును బ్యాంకుల్లో డిపాజిట్ చేశామని కుటుంబరావు చెప్పారు.