మందుబాబులకు బ్యాడ్ న్యూస్. చల్లని బీరుతో వీకెండ్ ఎంజాయ్ చేద్దాం అనుకునేవారికి ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇక నుంచి ఏపీలో చల్లటి బీర్లు అందుబాటులో ఉండవని తెలుస్తోంది. సంపూర్ణ మద్యపాన నిషేధంలో భాగంగా ప్రభుత్వం దశల వారీగా నిర్ణయాలు అమలు చేస్తోంది. అందులో భాగంగా మొదటి దెబ్బ బీర్ల అమ్మకాలపై పడింది. చల్లటి బీర్లను ఆపేసి ఇకపై లిక్కర్ తరహాలోనే వాటిని కూడా అమ్మాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.
చల్లని బీర్లకు ఇక చెల్లు..
ఏపీ ప్రభుత్వం ఎక్సైజ్ విధానంలో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అక్టోబర్ 1 నుండి అమల్లోకి వచ్చే కొత్త మద్యం విధానంలో ప్రస్తుతం అమలు చేస్తున్న విధానంలో అనేక మార్పులు చేస్తోంది. అందులో భాగంగా కొత్తగా అమలు కానున్న మద్యం విధానంలో చల్లటి బీర్లకు ప్రభుత్వం స్వస్తి చెప్పనుంది. ప్రభుత్వం రన్ చేసే మద్యం షాపుల్లో బీరు బాటిళ్లను కూల్ చేసే ఫ్రిడ్జ్‌లకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది.
మద్య దుకాణం అద్దె ఒక్క రూపాయి…
ప్రభుత్వం అక్టోబర్ 1 నుంచి నిర్వహించనున్న మద్యం షాపులను ఒక్క రూపాయికే అద్దెకు ఇచ్చేందుకు కొందరు ఆసక్తి చూపుతున్నారట. శనివారం ఈమేరుకు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అద్దె షాపుల ఎంపికకు టెండర్లు నిర్వహించగా.. అందరూ పోటీపడి మరి అతి తక్కువ ధరకే దుకాణాలు అద్దెకిచ్చేందుకు ముందుకు వచ్చారని తెలుస్తోంది. ఏలూరుతో పాటు చుట్టు పక్కల ఉన్న పలు గ్రామాలు మద్యం దుకాణాలను ఒక్క రూపాయికే ప్రభుత్వానికి అద్దెకు ఇవ్వనున్నారని సమాచారం.