Amaravati Farmers Padayatra: ఏపీకి ఏకైక రాజధాని ఎజెండాగా మొదలైన అమరావతి రైతుల మహా పాదయాత్రకు నిన్న బ్రేక్ పడింది. నేటి నుంచి యథావిధిగా యాత్ర కొనసాగనుంది. మరోవైపు రైతుల పాదయాత్రపై మంత్రులు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుండడం దుమారం రేపుతోంది. మహా పాదయాత్రకు మంగళవారం స్మాల్ బ్రేక్ ఇచ్చిన అమరావతి రైతులు.. ఇవాళ్టి నుంచి తిరిగి నడక ప్రారంభించనున్నారు. 15రోజులుగా యాత్ర చేస్తున్న రైతులు.. సోమవారం సాయంత్రం ఏలూరు జిల్లా కొత్తూరుకు చేరుకున్నారు. వారికి సంఘీభావంగా విపక్షాలు, ప్రజాసంఘాలు, ప్రజలు పాదయాత్రలో పాల్గొన్నారు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, టీడీపీ నేతలు మాగంటి బాబు, జవహర్, చింతమనేని ప్రభాకర్ రైతులకు తమ మద్దతు తెలిపారు. ఒకరోజు విరామం తీసుకున్న రైతులు.. ఇవాళ కొత్తూరు నుంచి యాత్రను కొనసాగించనున్నారు.
అది ధనవంతుల యాత్ర..
అయితే, రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉండాలంటూ అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్ర.. రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈ పాదయాత్రపై అధికార వైసీపీ నేతల సెటైరికల్ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. మంత్రులు మొదలు ఎమ్మెల్యేల దాకా.. మహా పాదయాత్రను టార్గెట్ చేస్తూ విమర్శలు, ఆరోపణలూ గుప్పిస్తున్నారు. తాజాగా, మరో మంత్రి అంబటి రాంబాబు.. తనదైన స్టయిల్‌లో కామెంట్స్ చేసి కాకపుట్టించారు. అది ధనవంతులు చేస్తున్న యాత్ర అంటూ ఎద్దేవా చేశారు అంబటి. మరోవైపు రైతుల మహాపాదయాత్రపై అధికార పక్షం చేసిన విమర్శలకు ధీటుగానే బదులిచ్చారు విపక్ష నేతలు. కోర్టు ఆదేశాలతో కొనసాగుతున్న పాదయాత్రను.. దమ్ముంటే ఆపాలంటూ సవాల్ విసిరారు. గోదావరి జిల్లాల్లో కొనసాగుతున్న యాత్ర.. 16వ రోజు ఏలూరు, పాలగుడె మీదుగా కొవ్వలి వరకు సాగనుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..