AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amalapuram Protest Live: కాకసీమగా మారిన కోనసీమ.. రావులపాలెంలో ఉద్రిక్తత..

ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జిల్లాగా మార్చడాన్ని..

Amalapuram Protest Live: కాకసీమగా మారిన కోనసీమ.. రావులపాలెంలో ఉద్రిక్తత..
Konaseema
Sanjay Kasula
| Edited By: Ravi Kiran|

Updated on: May 25, 2022 | 9:51 PM

Share

Konaseema District Rename Violence Live Updates: ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జిల్లాగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు చేపట్టిన నిరసనలు ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. మంగళవారం మధ్యాహ్నం అమలాపురం అంతటా హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. మంత్రి పినిపె విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇళ్లను ఆందోళనకారులు తగలబెట్టారు. అంతేకాకుండా కొంతమంది రోడ్లపైకి వచ్చి రాళ్ల దాడికి దిగటంతో.. పోలీసులు పరిస్థితులను కంట్రోల్ చేసేందుకు లాఠీచార్జ్ చేయడంతో పాటు ఒకదశలో గాల్లోకి కాల్పులు కూడా జరిపారు. ఇక ఈ అల్లర్లలో జిల్లా ఎస్పీ, డీఎస్పీతో పాటు ఏకంగా 30 మంది పోలీసులకు గాయాలయ్యాయి.

అసలేం జరిగింది..? వివాదమేంటి?

ఏపీలో కొత్త జిల్లాలు వచ్చాయి. 13 జిల్లాల నవ్యాంధ్ర.. 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌గా మారింది. ఈక్రమంలోనే… ఏపీలోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భాగమైన అమలాపురం నియోజకవర్గం జిల్లాల పునర్ వ్యవస్ధీకరణలో కొత్త జిల్లాగా మారింది. ప్రభుత్వం దీనికి కోనసీమ జిల్లాగా నామకరణం చేసింది. జిల్లాలో అత్యధికంగా ఉన్న ఎస్సీ జనాభా మనోభావాల మేరకు కోనసీమ జిల్లాను కాస్తా అంబేద్కర్ జిల్లాగా పేరు మార్చాలన్న డిమాండ్లు వినిపించాయి. తొలుత మౌనంగా ఉన్న ప్రభుత్వం.. తర్వాత.. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని కీలక నిర్ణయం తీసుకుంది. కొనసీమ జిల్లా పేరును.. డాక్టర్ అంబేడ్కర్ కొనసీమ జిల్లాగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పేరును కోనసీమ జిల్లాకు పెట్టడం ద్వారా ప్రభుత్వం సమంజమైన నిర్ణయమే తీసుకుందని ఎంతో మంది పార్టీలకతీతంగా అభినందించారు. కానీ… జిల్లాలో కొన్ని కులాల నేతలు, మద్దతుదారులు మాత్రం దీనిపై నిరసనలకు దిగారు. పలు చోట్ల దాడులు కూడా జరిగాయి. దీంతో పలు నియోజకవర్గాల్లో పరిస్ధితులు ఉద్రిక్తంగా మారింది. అంబేద్కర్ జిల్లా పేరును వ్యతిరేకిస్తూ నిరసనలకు దిగారు. అంబేద్కర్ జిల్లా పేరును కోనసీమకు పెట్టడాన్ని స్వాగతిస్తూ కొందరు, వ్యతిరేకిస్తూ మరికొందరు… పోటా పోటీగా ర్యాలీలు నిర్వహిస్తుండటం, అవి కాస్తా ఉద్రిక్తతలకు వేదికవుతుండటంతో పోలీసులు కూడా దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఇప్పటికే జిల్లాలో పలు చోట్ల ఇలాంటి వివాదాలు పెరుగుతుండటం, ఇవి దాడులకు కూడా దారితీస్తుండటంతో పోలీసులు చేసేది లేక 144 సెక్షన్ విధించారు. 144 సెక్షన్ అమల్లోకి రావడంతో పోలీసులు కూడా గట్టిగా నిఘా పెట్టారు.

అమలాపురం జిల్లాకు కోనసీమ పేరునే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కోనసీమ సాధన సమితి చేపట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. కోనసీమ జిల్లా పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు చేపట్టిన నిరసన కార్యక్రమం తీవ్రరూపం దాల్చింది. అమలాపురంలోని ప్రజాప్రతినిధుల ఇళ్లను తగలబెట్టడంతో మొత్తం రాష్ట్రమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 25 May 2022 07:27 PM (IST)

    మహనీయుడి పేరు పెడుతుంటే.. నీచమైన రాజకీయాలు – మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌

    కోనసీమ అల్లర్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌. జిల్లాకు మహనీయుడి పేరు పెడుతుంటే… కొందరు వెనక నుంచి నీచమైన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లాకు అంబేద్కర్‌ పేరు పెట్టేందుకు అంతా ఓప్పుకొని.. ఇప్పుడు కావాలని రాజకీయం చేస్తున్నారంటూ జనసేన, టీడీపీలపై మండిపడ్డారు అనిల్‌. ప్రతిపక్షాల మాటలు విని ఆవేశానికి లోనుకావొద్దని కోనసీమ యువతకు విజ్ఞప్తి చేశారు.

  • 25 May 2022 06:45 PM (IST)

    ఎస్పీ ఐశ్వర్య రస్తోగి కారుపై ఆందోళనకారులు రాళ్లు

    తూ.గో. జిల్లా ఎస్పీ వాహనంపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఎస్పీ ఐశ్వర్య రస్తోగి కారుపై ఆందోళనకారులు రాళ్లు విసిరారు. రావులపాలెం రింగ్​రోడ్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. రాళ్లు రువ్విన ఆందోళనకారులను పోలీసులు వెంటపడటంతో వారు పారిపోయారు.

  • 25 May 2022 06:37 PM (IST)

    చంద్రబాబు స్క్రిప్టు పవన్ చదువుతున్నారు- మంత్రి రోజా

    అంబేద్కర్‌ వలనే మనమంతా క్షేమంగా ఉన్నామని, అలాంటి అంబేద్కర్‌ పేరు పెడితే గొడవలు చేయడం ఏంటని ప్రశ్నించారు ఏపీ పర్యాటకశాఖ మంత్రి రోజా. కుట్ర వెనుక ఎవరున్నారో బయటకు లాగుతామని అన్నారు. ఇవే ప్రతిపక్షాలు గతంలో అంబేద్కర్ పేరు పెట్టాలని నిరాహారదీక్షలు చేశారని గుర్తు చేశారు. సూసైడ్ చేసుకుంటామంటూ టీవీల ముందుకు వచ్చిన వారు.. జనసేన పార్టీ నేత పవన్‌తో ఎంత క్లోజ్‌గా ఉన్నారో తెలుస్తోందన్నారు. చంద్రబాబు స్క్రిప్టు పవన్ చదువుతున్నారని, ప్యాకేజీ తీసుకుని మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

  • 25 May 2022 06:35 PM (IST)

    వైసీపీ పాలనపై బురద చల్లడానికి ప్రతిపక్షాలు కుట్ర- మంత్రి ఆర్కే రోజా

    కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెడితే గొడవ చేయటం బాధాకరమని ఏపీ పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఎస్సీ మంత్రి, బీసీ ఎమ్మెల్యే ఇళ్లు తగలబెట్టడం అన్యాయమన్నారు. దాడి చేసిన వారిలో 50 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అమలాపురం అల్లర్లపై కేసు విచారణ జరుగుతోందన్నారు. తప్పు చేసిన వారిని విడిచిపెట్టే ప్రస్తకే లేదన్నారు. వైసీపీ పాలనపై బురద చల్లడానికి ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని మంత్రి ఆర్కే రోజా విమర్శించారు.

  • 25 May 2022 06:03 PM (IST)

    ఏపీలో వైరల్ అవుతున్న అన్యం సాయి ఫోటోలు

    గతంలో వైసీపీకి చెందిన కార్యక్రమాల్లోనూ అన్యం సాయి పాల్గొన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత వంటి నేతలతో ఉన్న పోటోలను జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. జనసేనపై బురద జల్లేందుకు అధికార వైసీపీనే ఇలా చేస్తోందని జన సైనికులు ఆరోపిస్తున్నారు. అమలాపురం అల్లర్లపై ఇప్పటికే సోషల్ మీడియాలో వైసీపీ-జనసేన కార్యకర్తల మధ్య వార్ జరుగుతోంది. అసలు దీనంతటికీ కారణం అన్యం సాయియేనా లేదా అనేది పోలీసులు తేల్చాల్సి ఉంటుంది.

  • 25 May 2022 05:47 PM (IST)

    ఆందోళనలతో అగ్నిగుండంలా మారిన అమలాపురం

    కోనసీమ(Konaseema) జిల్లా పేరును అంబేడ్కర్ జిల్లాగా మార్చొద్దంటూ నిరసనకారులు చేస్తున్న ఆందోళనలతో అమలాపురం అగ్నిగుండంలా మారింది. ప్రశాంతంగా ఉంటే కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం(Amalapuram) లో అల్లర్లు, హింస చెలరేగడం హాట్ టాపిక్ గా మారింది. ఇది ప్రభుత్వ వైఫల్యమైనని ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన, బీజేపీలు ఆరోపిస్తుంటే ప్రభుత్వానికి మచ్చతెచ్చేందుకే ప్రతిపక్ష పార్టీలు కుట్రచేశాయని అధికార వైసీపీ(YCP) కౌంటర్ ఇస్తోంది.

  • 25 May 2022 05:00 PM (IST)

    అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్న అమలాపురం పోలీసులు

    కోనసీమ జిల్లా సాధన సమితి నేతలు, కార్యకర్తలను రావులపాలెంలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. దాదాపు వంద మందిని అరెస్ట్‌ చేసి పోలీస్టేషన్‌కి తరలించారు. కోనసీమ అనేది మొదటి నుంచి ఉన్న పేరని దాన్ని మార్చవద్దని డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు.

  • 25 May 2022 04:51 PM (IST)

    రావులపాలెంలో ఉద్రిక్తత.. కారణం ఇదే..

    కానసీమ కాస్త కాకసీమగా మారింది. రావులపాలెంలో ఉద్రిక్తత నెలకొంది. స్థానక యువకు బైక్ ర్యాలీ నిర్వహించేందుకు రెడీ అవుతున్నట్లుగా సమాచారం

  • 25 May 2022 04:47 PM (IST)

    అమలాపురంలో నిలిచిపోయిన సెల్‌ఫోన్ నెట్వర్క్..

    కోనసీమలోని టెన్షన్ కొనసాగుతోంది. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. నిఘా మరింత పెంచారు. తాజాగా అమలాపురంలో మొబైల్ నెట్వర్క్ నిలిచిపోయింది. మొబైల్ సిమ్స్ పనిచేయకపోవడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.

  • 25 May 2022 04:42 PM (IST)

    తగలబడుతుంటే ఫైర్ ఇంజన్లు ఒక్కటి కూడా లేవా- అచ్చెన్నాయుడు

    అమలాపురంలో హింసాత్మక ఘటనపై  ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. లా అండ్ ఆర్డర్‌లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇళ్లు తగలబడుతుంటే ఫైర్ ఇంజన్లు ఒక్కటి కూడా లేవా అని ప్రశ్నించారు.

  • 25 May 2022 04:33 PM (IST)

    పోలీసుల అదుపులో అన్యం సాయి

    అమలాపురం ఆందోళనలల్లో కీలక అనుమానితుడు అన్యం సాయిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కోనసీమ జిల్లా పేరు మార్చవద్దంటూ గతంలో కిరోసిన్ పోసుకుని అన్యం సాయి ఆత్మహత్యాయత్నం చేశాడు. అతనిపై రౌడీ షీట్ వున్నట్లుగా పోలీసులు గుర్తించారు.

  • 25 May 2022 03:54 PM (IST)

    పేరు మారుస్తూ ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల

    తాజాగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా పేరు మారుస్తూ ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీంతో ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

  • 25 May 2022 03:54 PM (IST)

    ఆందోళనలు చెలరేగకుండా అదనపు బలగాలు -హోంమంత్రి తానేటి వనిత

    ఆందోళనలు చెలరేగకుండా అదనపు బలగాలను పంపినట్లు తెలిపారు హోంమంత్రి తానేటి వనిత. ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా అదుపులో ఉన్నాయన్న హోంమంత్రి.. హింసకు పాల్పడిన 46 మంది ఆందోళనకారుల్ని అరెస్టు చేసినట్లు చెప్పారు.

  • 25 May 2022 03:52 PM (IST)

    ఇది నిజమైన ఫ్రెండ్లీ పోలీసింగ్ – తానేటి వనిత

    అమలాపురం ఘటనపై హోంమంత్రి తానేటి వనిత డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డితో అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిన్నటి ఘటనలో ఆందోళనకారులు దాడి చేస్తున్నా.. ఎదురుదాడి చేయకుండా పోలీసులు సంయమనం పాటించారన్నారని ప్రశంసించారు. పోలీసులు వ్యవహరించిన తీరు ఫ్రెండ్లీ పోలీసింగ్​కు నిదర్శనమని అన్నారు.

  • 25 May 2022 03:28 PM (IST)

    పోలీస్ వలయంలో రావులపాలెం..

    ‘ఛలో రావులపాలెం’ పేరిట జాతీయ రహదారిపై ఆందోళనకు కోనసీమ సాధనా సమితి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. నిరసనలకు అనుమతి లేదన్న పోలీసులు.. ముందస్తుగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

  • 25 May 2022 02:05 PM (IST)

    పోలీసుల వైఫల్యం లేదు.. TV9తో మంత్రి విశ్వరూప్

    టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన ద్వితీయ శ్రేణి నేతలతో కలిసి రౌడీ షీటర్లు అమలాపురంలో అల్లర్లు సృష్టించారని మంత్రి విశ్వరూప్ ఆరోపించారు. గమ్యం లేని ర్యాలీలో అసాంఘిక శక్తులు దూరి అల్లర్లు సృష్టించారన్నారు. ఈ ఘటనకు ఫలానా కులస్తులు కారకులని చెప్పడం సరికాదని.. రౌడీ షీటర్ లకు కులం ఉండదన్నారు. అల్లర్లలో తమ పార్టీ నేతలు ఎవరూ లేరన్నారు.  ఈ ఘటనలో సాధారణ ప్రజల ప్రమేయం లేదన్నారు. అల్లర్లలో పాల్గొన్న రౌడీ షీటర్లను పోలీసులు గుర్తిస్తున్నట్లు చెప్పారు. సంయమనం పాటించినందునే విధ్వంసం ఆగిందన్నారు. ఇందులో పోలీసుల వైఫల్యం ఏమీ లేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను దృష్టి మరల్చడానికే అల్లర్లు సృష్టించారన్న విపక్ష నేతల విమర్శలు అర్దరహితమన్నారు.  సతీష్ ఇంటి పక్కనే ఉన్న టీడీపీ మాజీ శాసనసభ్యుడు అనందరావ్ ఇంటిపై దాడి జరగలేదని గుర్తుచేశారు. ఎస్సీలు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

  • 25 May 2022 01:16 PM (IST)

    కాలిపోయిన తన నివాసానికి వచ్చిన మంత్రి విశ్వరూప్

    అమలాపురంలో కాలిపోయిన తన నివాసానికి తొలిసారి వచ్చిన మంత్రి విశ్వరూప్.

  • 25 May 2022 01:13 PM (IST)

    జగన్, చంద్రబాబు, పవన్ దిష్టబొమ్మల దగ్ధం..

    కర్నూలు: ఎమ్మిగనూరులో సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ దిష్టబొమ్మలను అంబేద్కర్ వాదులు దహనం చేశారు. కోనసీమ అంబేద్కర్ జిల్లాగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.

  • 25 May 2022 01:08 PM (IST)

    అమలాపురంలో అగ్గిపెట్టిందెవరు..? – విశ్లేషణ

    కోనసీమ ఘటన వెనుక కుట్ర రాజకీయం ఉందా? అమలాపురంలో అగ్గి పెట్టిందెవరు.. ఈ కథనాన్ని చదవేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.. 

  • 25 May 2022 01:07 PM (IST)

    భద్రతా వైఫల్యమే కారణం.. టీడీపీ నేత అచ్చెన్నాయుడు

    అమలాపురం ఘటనపై తమపై వస్తున్న ఆరోపణలను టీడీపీ ఖండించింది. భద్రతా వైఫల్యమే కారణమని టీడీపీ నేత అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రజలు శాంతియుతంగా ఉండాలని సూచించారు. వైసీపీకి విధ్యంసాలు సృష్టించడం కొత్త కాదని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. తప్పును కప్పిపుచ్చుకునేందుకే టీడీపీపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. శాంతి భద్రతల పర్యవేక్షణలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

  • 25 May 2022 12:16 PM (IST)

    షాపులను తెరుచుకోండి.. అమలాపురం చాంబర్ ఆఫ్ కామర్స్..

    అమలాపురంలో అల్లర్ల నేపథ్యంలో 144 సెక్షన్ విధించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో పట్టణంలోని షాపులన్నీమూతపడ్డాయి. దీంతో అమలాపురం చాంబర్ ఆఫ్ కామర్స్ కీలక ప్రకటన చేసింది. నిన్న జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం.. ఈ సందర్భంగా పోలీసులు పట్టణాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. ఎవరూ భయపడాల్సిన పనిలేదు. కావున వ్యాపారులు తమ తమ షాపులను యధావిధిగా తెరుచుకుని వ్యాపారాలు చేసుకోవచ్చని ఆర్డివో తెలియజేశారని చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కల్వకొలను తాతాజీ ప్రకటన చేశారు. షాపులను తెరుచుకొని వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు.

  • 25 May 2022 12:02 PM (IST)

    అంబేద్కర్ పేరు పెట్టాలని చంద్రబాబు, పవన్ డిమాండ్ చేశారు.. మంత్రి కొట్టు సత్యనారాయణ

    ప్రశాంతంగా ఉండే ప్రాంతంలోనూ కల్లోలం సృష్టించి, విధ్వంసం చేస్తున్నారని.. మంత్రి కొట్టు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తంచేశారు. అంబేద్కర్ పేరు పెట్టాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారని చెప్పారు. ప్రజల కోరిక మేరకు పేరు మారిస్తే వారి తప్పుడు నిర్ణయాలు, రాజకీయ పబ్బం గడుపుకోవటానికి టిడిపి, జనసేన వికృత స్వరూపాన్ని బయటపెట్టాయని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం పట్ల ప్రజలు విశ్వాసంగా ఉన్నారని కోనసీమలో విధ్వంసం సృష్టించారని తెలిపారు. కాగా.. సిఎం జగన్ దావోస్ పర్యటన విజయవంతమైందని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు.

  • 25 May 2022 11:57 AM (IST)

    వారిపై దేశద్రోహం కేసు పెట్టాలి.. దళిత బహుజన ఫ్రంట్ డిమాండ్

    విజయవాడ: కోనసీమ ఘటనను దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి భాగ్యరావు ఖండించారు. దళితులకు వ్యతిరేకంగా కోనసీమలో దాడులు జరిగాయని ఆక్షేపించారు. కుల పిచ్చితో కొంత మంది ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారని అన్నారు. ఈ ఘటనలో పోలీసుల వైఫల్యం కూడా ఉందన్నారు. ప్రభుత్వం సామాజిక వైరుధ్యాన్ని అరికట్టాలని సూచించారు. జిల్లాకు అంబేద్కర్ పేరు వ్యతిరేకించే వారిపై దేశ ద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. విధ్వంసానికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం జిల్లా పేరును అంబేద్కర్ కోనసీమగానే కొనసాగించాలన్నారు.

  • 25 May 2022 11:53 AM (IST)

    కోనసీమ ఘటనలో ప్రతిపక్షాల కుట్ర: ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి

    అల్లూరి జిల్లా పాడేరులో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ప్రెస్ మీట్..

    కోనసీమ ఘటనలో ప్రతిపక్షాల కుట్ర దాగి ఉందని వైసీపీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం పరిపాలన చూసి ఓర్వలేక ఇటువంటి ఘటనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ ఘటనకు బాధ్యులపై ఏస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని కోరారు.

  • 25 May 2022 11:49 AM (IST)

    విజయవాడకు పవన్ కల్యాణ్..

    పవన్ కల్యాణ్ ఈ రోజు విజయవాడకు రానున్నారు. అమలాపురంలోని జరిగిన అల్లర్ల నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం 2 గంటలకు విలేకర్ల సమావేశం నిర్వహిస్తారు. మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈ సమావేశం ఉంటుందని జనసేన ప్రకటనలో తెలిపింది.

  • 25 May 2022 11:09 AM (IST)

    అమలాపురం ఘటనలో 46 మంది అరెస్ట్.. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడి

    అమలాపురం ఘటనపై 7 కేసులు నమోదయ్యాయి. కలెక్టరేట్, మంత్రి విశ్వరూప్ రెండు ఇల్లుల దహనం, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటి కి నిప్పు, మూడు బస్సుల దగ్దం పై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్లు ఏపీ డిజిపి కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే ఈ ఘటనతో ప్రమేయమున్న 46 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఇందులో ప్రమేయమున్న మరో 72 మంది అరెస్ట్ కు ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా రౌడీ షీటర్లందరిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు.

    ప్రస్తుతం అమలాపురంలో పరిస్తితి పూర్తి గా అదుపులో ఉందని డీజీపీ తెలిపారు. అదనపు బలగాల మోహరించినట్లు తెలిపారు.  ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరిగే అవకాశమే లేదన్నారు. నిన్నటి ఘటన అనుకోకుండా జరిగిన పరిణామంగానే భావిస్తున్నామని చెప్పారు. వాట్సప్ గ్రూప్ ల లో తప్పుడు ప్రచారం ద్వారా గుమిగూడినట్లు తెలిపారు.

    అమలాపురం లో ఇంటర్నెట్ పై తాత్కాలికంగా ఆంక్షలు విధించినట్లు తెలిపారు. 144 సెక్షన్ అమలులో ఉందని.. గ్రూప్స్ గా తిరిగితే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఇంటర్మీడియట్ ఎగ్జాం నేపథ్యంలో ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామని డీజీపీ వివరించారు.

  • 25 May 2022 10:58 AM (IST)

    ఆ ఇష్యూని డైవెర్ట్ చేసేందుకే మాపై ఆరోపణలు.. జనసేన నేత

    విశాఖ: అమలాపురం ఘటనలో పోలీసులు కంటే ముందే జనసేనను బ్లేమ్ చేస్తూ వైసిపి నాయకులు మాట్లాడటం విడ్డూరంగా ఉందని జనసేన పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ శివశంకర్ అన్నారు. అల్లర్లు జరుగుతాయని ఘటనను ముందే రాష్ట్ర ఇంటెలిజన్స్ ఎందుకు పసిగట్టలేకపోయిందని ప్రశ్నించారు. ఇందులో రాష్ట్ర ఇంటెలిజన్స్ వైఫల్యం ఉందన్నారు. MLC అన౦తబాబు దళితుడైన డ్రైవర్ సుబ్రమణ్యంను హత్య చేయటంతో వైసిపి పట్ల దళితుల్లో వ్యతిరేకత ఏర్పడిందన్నారు. దాని నుండి దృష్టి మరల్చడానికే ఈ విధమైన ఆరోపణలు వైసిపి నాయకులు చేస్తున్నారని ఆరోపించారు. వైసిపి రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చుపెట్టి మనుగడ కొనసాగించాలని చూస్తోంది తప్పి వాళ్ళకి ఒక సిద్ధాంతం లేదని ఎద్దేవా చేశారు.

  • 25 May 2022 10:54 AM (IST)

    విశ్వరూప్, పొన్నాడ సతీష్ కుటుంబ సభ్యులను పరామర్శించిన హోంమంత్రి

    కోనసీమకు హోం మంత్రి తానేటి వనిత , జోగి రమేష్ చేరుకున్నారు. అమలాపురంలోని విశ్వరూప్ నివాసానికి చేరుకున్న రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత , జోగి రమేష్.. విశ్వరూప్ తోపాటు.. పొన్నాడ సతీష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

  • 25 May 2022 10:53 AM (IST)

    గుంటూరులో ఆందోళనకు యత్నం.. దళిత నేతల అరెస్టు

    గుంటూరు: అమలాపురం ఘటనకు వ్యతిరేకంగా అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాలు నిరసనకు పిలుపునిచ్చారు. లాడ్జి సెంటర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆందోళన చేపట్టేందుకు అనుమతి లేదని దళిత నేతల్ని అరెస్టు చేసిన పోలీసులు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాకి మద్దతుగా నినాదాలు చేశారు.

    అన్ని జిల్లాలతో పాటు అంబేడ్కర్ జిల్లా ప్రకటిస్తే వివాదం ఉండేది కాదని మాలమహనాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ళ అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం కావాలనే కులాల మధ్య చిచ్చు పెడుతోందని ఆరోపించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

  • 25 May 2022 10:49 AM (IST)

    ఏపీలో ఉన్నామా.. పాకిస్తాన్ లో ఉన్నామా..? అని ఎంపీ జీవీఎల్

    ఏపీలో ఉన్నామా.. పాకిస్తాన్లో ఉన్నామా..? అని ఎంపీ జీవీఎల్ ప్రశ్నించారు. నవరత్నాలకు అంబేద్కర్ పేరు పెట్టొచ్చు కదా..? అని జీవీఎల్ ప్రభుత్వానికి సూచించారు. బీజేపీ శ్రేణులు ఈ ఆందోళనలో పాల్గొనలేదని పేర్కొన్నారు.

  • 25 May 2022 10:46 AM (IST)

    అమలాపురానికి హోంమంత్రి వనిత..

    హోంమంత్రి తానేటి వనిత బుధవారం మధ్యాహ్నం అమలాపురం రానున్నారు. విశ్వరూప్, సతీష్ కుటుంబాలను మంత్రి పరామర్శించనున్నారు.

  • 25 May 2022 10:38 AM (IST)

    కోనసీమలో ప్రశాంత వాతావరణం.. భారీగా పోలీసు బలగాల మోహరింపు

    కోనసీమలో ప్రశాంత వాతావరణం కనిపిస్తోంది. యధావిధిగా ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. జనం నిత్యావసరాల కోసం రోడ్ల మీదకు వస్తున్నారు. 144సెక్షన్‌ మాత్రం అమల్లో ఉంది. ఘర్షణలు, గొడవలకు ఆస్కారం లేకుండా భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. సిట్యువేషన్‌ని పూర్తిగా తమ కంట్రోల్‌ లోకి తీసుకున్నారు పోలీసులు.అమలాపురంలో సిట్యువేషన్ మొత్తం తమ కంట్రోల్‌లోనే ఉందని డీఐజీ పాలరాజు తెలిపారు. నిన్నటి ఆందోళనలో కొంతమంది విద్రోహ శక్తులు పాల్గొన్నారని.. వాళ్లందర్నీ గుర్తిస్తున్నామన్నారు. అమలాపురంలో సాధారణ పరిస్థితులు నెలకొనసడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తంచేశారు.

  • 25 May 2022 10:34 AM (IST)

    అమలాపురం అల్లర్లు పొలిటికల్ టర్న్..

    అమలాపురంలో అల్లర్ల వ్యవహారం క్రమంగా పొలిటికల్‌ టర్న్ తీసుకుంది. అల్లర్లు, ఆందోళన వెనుక టీడీపీ, జనసేన హస్తం ఉందని అధికార పార్టీ వైసీపీ ఆరోపించింది. మహనీయుడి పేరు పెడితే అభ్యంతరమేంటని నిలదీసింది. అయితే వైసీపీ ఆరోపణలను ఆ రెండు పార్టీలు ఖండించాయి. బాధ్యులెవరైనా కఠినంగా శిక్షించాల్సిందేనని స్పష్టం చేశాయి. మధ్యాహ్నం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్..వైసీపీ నేతల ఆరోపణలపై స్పందించనున్నారు.

    కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు మార్పుతో ఆందోళన ఉగ్రరూపం దాల్చింది. ఓ వర్గం పేరు మార్చొద్దని డిమాండ్‌ చేస్తే.. దళిత సంఘాలు మాత్రం పేరు మార్చాల్సిందేనని పట్టుబట్టాయి. లోకల్‌గా చినికి చినికి గాలివానగా మారిన వివాదం.. చివరకు రావణకాష్టం రాజేసింది.

  • 25 May 2022 10:29 AM (IST)

    అల్లర్లకు కారణమైన వారిని గుర్తించే పనిలో పోలీసులు

    అమలాపురంలో నిన్నటి అల్లర్లకు కారణమైన వారిని గుర్తించే పనిని పోలీసులు చేపట్టారు. కలెక్టరేట్‌ దగ్గర జరిగిన అల్లర్లపై స్థానిక వీఆర్వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిన్నటి వీడియోల ఆధారంగా 200 మంది గుర్తించిన పోలీసులు…వారిని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. జిల్లా ఎస్పీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి తదుపరి కార్యాచరణ చేపట్టనున్నారు. గతంలో ఈ ప్రాంతంలో పనిచేసిన ఎస్పీలు, డీఐజీలతో కలిసి విశాఖ సీపీ శ్రీకాంత్‌ సమీక్షల పాల్గొన్నారు. నిన్న ఆందోళనల్లో ఎస్పీ కోటిరెడ్డి గాయాపడటం తెలిసిందే.

  • 25 May 2022 10:27 AM (IST)

    మధ్యాహ్నం పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్..

    అల్లర్లు, ఆందోళనల వెనుక టీడీపీ, జనసేన హస్తం ఉందని అధికార పార్టీ ఆరోపిస్తోంది.  మంత్రి దాడిశెట్టి రాజా సైతం ఆందోళనల్లో జనసేన పాత్ర ఉందని ఆరోపించారు. దీని మీద జనసేన అధ్యక్షుడు పవన్ మధ్యాహ్నం ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. అధికారపక్ష నేతల ఆరోపణలపై పవన్ కల్యాణ్ స్పందించనున్నారు.

  • 25 May 2022 10:26 AM (IST)

    పక్కా ప్లాన్‌తో విధ్వంసం సృష్టించారు: దాడిశెట్టి రాజా

    కోనసీమలో చంద్రబాబు, పవన్‌ అలజడులు సృష్టిస్తున్నారని ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపించారు. పక్కా ప్లాన్‌ ప్రకారమే విధ్వంసం సృష్టించారని అన్నారు. చంద్రబాబుకు ప్రజలు, వ్యవస్థలపై గౌరవం లేదని చెప్పారు. అన్ని పార్టీల అంగీకారంతోనే జిల్లా పేరు మార్చామని దాడిశెట్టి రాజా అన్నారు.

  • 25 May 2022 09:45 AM (IST)

    పోలీసుల వలయంలో కోనసీమ..

    కోనసీమ జిల్లా అమలాపురంను పోలీసు బలగాలు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ప్రస్తుతం ఎలాంటి అల్లర్లు జరగకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు.

  • 25 May 2022 08:57 AM (IST)

    అమలాపురంలో కొనసాగుతున్న సెక్షన్ 144

    ఉద్రిక్తత పరిస్థితుల నేపధ్యంలో అమలాపురంలో సెక్షన్ 144 కొనసాగుతోంది. అడుగడుగునా పోలీసులు మొహరించారు. నేడు మధ్యాహ్నం ఛలో రావులపాలెంకు కోనసీమ జిల్లా సాధన సమితి పిలుపునివ్వడంతో పోలీసులు ముందస్తుగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

  • 25 May 2022 08:54 AM (IST)

    అమలాపురంకు ఆర్టీసీ బస్సులు నిలిపివేత

    అమలాపురంలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపధ్యంలో ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు అధికారులు. కాకినాడ , రాజమండ్రి నుంచి కోనసీమకు బస్ సర్వీసులు రద్దు చేస్తున్నట్లు నోటిసు బోర్డులు పెట్టారు.

  • 25 May 2022 08:48 AM (IST)

    కర్ఫ్యూ విధించాలన్న నిర్ణయంపై పున:సమీక్ష

    అమలాపురంలో పరిస్థితులను సాధారణ స్థితికి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. హోటల్స్‌తో పాటు దుకాణాలను తెరవాలని వ్యాపారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. పాలు, నిత్యావసర వస్తువులుకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. రాత్రి అమలాపురంలో కార్డన్ సెర్చ్ చేయాలని భారీగా బద్రతాబలగాలను పిలిపించిన ఉన్నతాధికారులు.. కుండపోత వర్షం కారణంగా వ్యూహాన్ని మార్చారు. వర్షంతో తాత్కాలికంగా పరిస్థితులు సద్దుమనిగినట్లు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా కర్ఫ్యూ విధించాలన్న నిర్ణయంపై అధికారులు పున:సమీక్షిస్తున్నారు.

  • 25 May 2022 08:44 AM (IST)

    పోలీసుల నిఘాలో అమలాపురం..

    కోనసీమ జిల్లా అమలాపురంని పూర్తిగా పోలీసు బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఎలాంటి అల్లర్లు జరగకుండా భారీగా బలగాలు చేరుకున్నారు.. మంత్రి విశ్వరూపు నివాసంతో పాటు ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ నివాసం కూడా తగలబెట్టడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు పోలీసులు.. నిన్నటి వరకు పార్టీ కార్యకర్తలతో , కుటుంబ సభ్యులతో కళకళలాడిన నివాసం కాలి బూడిదయ్యి.. శకటాలు కనిపిస్తున్నాయి ఇంట్లో ఉన్న విలువైన సామాగ్రి అగ్నికి ఆహుతి అయ్యింది.. దాదాపు 4 ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టారు నిరసనకారులు ..సీసీ కెమెరాలను సైతం పగలగొట్టి దాడికి పాల్పడ్డారు.

Published On - May 25,2022 8:40 AM