
మేం పిల్లల్ని కొట్టలేము… తిట్టలేము… ఏం చేతగాని వాళ్ళలా చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి… అంటూ ఇటీవల బొబ్బిలిలో ఓ ప్రధానోపాధ్యాయడు చేతులు కట్టుకుని, గుంజీలు తీసి, సాష్టాంగ నమస్కారం చేసిన సంగతి మరువకముందే… ఇటు అనంతపురం జిల్లాలో ఓ ప్రధానోపాధ్యాయురాలు కూడా మీ పిల్లల అల్లరి భరించలేకపోతున్నామని ఏకంగా తల్లిదండ్రులకు లేఖ రాశారు. ఉరవకొండ మండలం అమిద్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం నాగ మంజుల… పాఠశాలలో పిల్లల అల్లరి చేష్టలు ఎక్కువయ్యాయని వారిని దారిలో పెట్టకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తల్లిదండ్రులకు హెచ్చరిస్తూ లేఖ రాశారు… హెచ్ఎం నాగ మంజుల రాసిన లేఖ ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఎన్నిసార్లు మంచిగా చెప్పిన పిల్లలు వినడం లేదని… మంచినీళ్లు తాగొస్తామని బయటకు వెళ్లి ఇంటికి వెళ్లిపోతున్నారని హెచ్ఎం నాగ మంజుల ఆవేదన వ్యక్తం చేశారు. పదవ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు పాఠశాలలో బెంచీలు విరగ్గొట్టి, స్విచ్ బోర్డులను పగలగొట్టి, ఫ్యాన్ రెక్కలు ఒంచేసి… క్లాస్ రూమ్ లో నానా బీభత్సం చేస్తున్నారని వాపోయారు. పిల్లలపై తల్లిదండ్రులు కాస్త శ్రద్ధ పెట్టి వారిని సరైన దారిలోకి తీసుకురావాలని హెచ్ఎం నాగమంజుల తల్లిదండ్రులకు విన్నవించారు… ఇలాగే అల్లరి, చిల్లరగా… భరించలేని స్థాయిలో విద్యార్థులు ఉంటే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాల్సి వస్తుందని హెచ్ఎం నాగమంజుల… విద్యార్థుల తల్లిదండ్రులకు రాసిన లేఖ వైరల్ అవ్వడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ చూడండి..