Andhra Pradesh: తగ్గేదేలే.. తొడగొడుతున్న నెల్లూరు పాలిటిక్స్.. ఓ వైపు ఎమ్మెల్యే.. మరోవైపు ఎంపీ.. 

|

Feb 09, 2023 | 8:25 AM

ఎమ్మెల్యే ఆరోపణలు.. ఇంచార్జ్ కౌంటర్లతో నెల్లూరు రూరల్ పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నుంచి ఇక్కడ రాజకీయాలు మలుపు తిరుగుతున్నాయి.

Andhra Pradesh: తగ్గేదేలే.. తొడగొడుతున్న నెల్లూరు పాలిటిక్స్.. ఓ వైపు ఎమ్మెల్యే.. మరోవైపు ఎంపీ.. 
Adala Prabhakar Reddy, Kotamreddy Sridhar Reddy
Follow us on

నెల్లూరు రూరల్‌లో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే అన్నట్టుగా రాజకీయం నడుస్తోంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పక్కనబెట్టి ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఇంచార్జ్ పదవి కట్టబెట్టింది పార్టీ అధిష్టానం. అప్పటి నుంచి ఆయన జోష్ పెంచారు. నియోజకవర్గంలో పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ.. కేడర్‌ను ఏకతాటి పైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. గ్రామాలు కొత్త కాదు, గ్రామాల్లో అనేక సమస్యలను పరిష్కరించాను. త్వరలో అన్ని గ్రామాల్లో పర్యటిస్తానన్నారు ఆదాల. ప్రతి సమస్యకు పూర్తిస్థాయిలో పరిష్కరిస్తాం చూపించడమే కాకుండా.. సర్పంచ్‌లకి, ఎంపీటీసీలకి అండగా ఉంటామన్నారు. ఎవరికీ బెదరాల్సిన అవసరం లేదన్నారు. 75 నుంచి 80 లక్షల రూపాయల నిధులను జిల్లా పరిషత్ నుంచి రూరల్ కి ఇస్తే కాంట్రాక్టర్లను బెదిరించారన్నారు. మరో కోటి రూపాయలు కూడా విడుదల చేయాలని చూసినా పనులు జరక్కుండా కోటంరెడ్డి అడ్డుకున్నారని ఆరోపించారు.

అలాంటి వ్యక్తి ఇప్పుడు ధర్నాలు చేస్తాననడం హాస్యాస్పదంగా ఉందంటూ ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. కోటంరెడ్డి జీవితకాలం ధర్నాలు చేసుకోవాల్సిందే తప్ప ఇంకేం చేయలేడన్నారు. కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీకి దూరం కావడంతో.. అక్కడ పార్టీని బలోపేతం చేసే దిశగా కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు ఆదాల. అదే సమయంలో.. కోటంరెడ్డి కూడా బలప్రదర్శన చేపట్టారు. తన అనుచరులు, కార్యకర్తలతో భేటీ అవుతున్నారు.

మరోవైపు ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ చేపట్టాలంటూ కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కల్గించారన్న ఎమ్మెల్యే.. నిజానిజాలు తేల్చాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సైతం కేంద్రాన్ని కోరాలన్నారు. అయితే అది ట్యాపింగ్ కాదు.. రికార్డింగే అంటూ ఆయన మిత్రుడు చెప్పడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. ఇందులో ఎవరి వాదన నిజం.. ఎవరిది అబద్ధమనేది ఆసక్తిగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..