Actor Ali: వైసీపీకి నటుడు అలీ రాజీనామా..

|

Jun 28, 2024 | 8:43 PM

ఇప్పుడు నేను ఏ పార్టీలోనూ లేను, ఏ పార్టీ సపోర్టర్‌ను కాదంటూ అలీ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇక మీదట సినిమాలు, షూటింగ్స్‌పైనే తన ఫోకస్ ఉంటుందన్నారు. కామన్ మ్యాన్ లాగా ఐదేళ్లకు ఒకసారి వెళ్లి ఓటు వేసి వస్తానని.. ఇకపై రాజకీయాలకే దూరంగా ఉంటానంటూ సంచలన ప్రకటన చేశారు అలీ.

Actor Ali:  వైసీపీకి నటుడు అలీ రాజీనామా..
Ali - YS Jagan
Follow us on

సినీ నటుడు అలీ వైసీపీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్‌కు పంపారు అలీ. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు అలీ. ఆ పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో అలీకు రాజ్యసభ పోస్ట్ ఇస్తున్నారని.. ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నారని.. వార్తలు తెగ వైరల్ అయ్యాయి. వక్స్ బోర్డ్ చైర్మన్ పదవిపై కూడా ప్రచారం జరిగింది. అయితే ఆయనకు ఈ పదవులు ఏవీ దక్కలేదు. 2022లో అలీని ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా ప్రభుత్వం నియమించింది. ఆ పదవిలో ఆయన రెండేళ్లు కొనసాగారు. 2024 ఎన్నికల్లో అయినా తనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు వస్తుందని భావించారు అలీ. కానీ ఆ ఆశ నెరవేరలేదు. టికెట్ దక్కకపోవడంతో ఎన్నికల సమయంలో అలీ ఎక్కడ కూడా కనిపించలేదు. తాజాగా ఏపీ కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన నేపథ్యంలో.. అలీ వైసీపీని వీడటం చర్చనీయాంశమైంది.

బాలనటుడిగా రాణించాక.. సినిమాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్‌కి అవకాశం ఇచ్చిన రామానాయుడు కోసమే తాను 1999లో రాజకీయాల్లో అడుగు పెట్టానని అలీ తాజాగా విడుదల చేసిన వీడియో సందేశంలో తెలిపారు. రామానాయుడు బాపట్లలో ఎంపీగా నిలబడినప్పుడు వచ్చి ప్రచారం చేయాలని కోరడంతోనే.. టీడీపీలో చేరినట్లు స్పష్టం చేశారు. 20 ఏళ్లు టీడీపీలో కొనసాగి.. తర్వాత వైసీపీలో చేరినట్లు తెలిపారు. ఇక తనకు అన్నం పెట్టింది తెలుగు పరిశ్రమ అని అలీ చెప్పుకొచ్చారు. 45 ఏళ్లుగా.. 6 భాషల్లో.. 1200 పైచిలుకు సినిమాల్లో నటించినట్లు తెలిపారు. తనకు సాయం చేసే గుణం ఉందని.. దానికి రాజకీయ బలం తోడైతే.. మరింత సేవ చేయవచ్చనే ఉద్దేశంతోనే పాలిటిక్స్‌లోకి వచ్చినట్లు అలీ వెల్లడించారు. తాను ఉన్న పార్టీల్లో ఉన్న నాయకులను పొగిడాను తప్పితే.. ప్రతిపక్ష పార్టీల్లోని నాయకులను ఎప్పుడూ తిట్టలేదని క్లారిటీ ఇచ్చారు. ఇకపై రాజకీయాలకే దూరంగా ఉంటానని ఆయన ప్రకటించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..