ఓ కుటుంబంలో తగదా.. ఒకరిపై దాడి జరిగింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేశారు పోలీసులు. అందులో నిందితుడుగా ఉన్న వ్యక్తితో లాలూచీపడ్డాడు ఓ ఖాకీ.! బెదిరించి.. భయపెట్టాడు. కాస్త చేయి తడిపితే.. సేవ్ చేస్తానని నిందితుడికి ఆఫర్ చేసాడు. చివరకు.. ఓ కేసులో నిందితుడే బాధితుడు అయ్యాడు..!
విశాఖలో గాజువాక పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఏసీబీ అధికారులకు చిక్కిపోయాడు. ఐదువేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు హెడ్ కానిస్టేబుల్ రాజశేఖర్. ఓ కేసులో నిందితుడికి ఫెవర్ చేసేందుకు లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పోలీస్ స్టేషన్ ఆవరణలో లంచం తీసుకుంటుండగా.. అప్పటికే మాటు వేసిన ఏసీబీ అధికారులు.. హెడ్ కానిస్టేబుల్ రాజశేఖర్‌ను పట్టుకున్నారు.
రైల్వే న్యూ కాలనీకి చెందిన షేక్ రసూల్ అనే వ్యక్తి.. కుటుంబ తగాదా కారణంగా గాజువాక పోలీసు స్టేషన్లో నిందితుడుగా ఉన్నాడు. కుటుంబంలో కొట్లాట కారణంగా అతనిపై కేసు నమోదు అయింది. అయితే.. రసూల్‌కు ఆ కేసులో సహాయం చేయడంతో పాటు, నమోదైన కేసును 307 ఐపీసీ (IPC) (హత్యాయత్నం) కేసుగా మార్చకుండా వుంచడానికి గాజువాక పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ రాజశేఖర్ అయిదు వేలు లంచంగా డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేకపోవడంతో ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఓ కేసులో నిండితుడుగా ఉన్న వ్యక్తే.. ఇప్పుడు బాధితుడుగా మారాడు. ఫిర్యాదు అందుకున్న ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. గాజువాక పోలీస్ స్టేషన్ ఆవరణలో హెడ్ కానిస్టేబుల్ రాజశేఖర్‌ను ట్రాప్ చేశారు. బాధితుని నుండి లంచంగా అయిదు వేలు తీసుకుంటుండగా ఏసీబి అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
హెడ్ కానిస్టేబుల్ రాజశేఖర్‌ను పట్టుకున్న తర్వాత.. పోలీస్ స్టేషన్లోకి తీసుకువెళ్లి అక్కడ కూడా తనిఖీలు చేశారు. రికార్డులను వెరిఫై చేశారు. నిందితుడిని అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరుస్తామని ఏసీబి తెలిపింది. హెడ్ కానిస్టేబుల్ ఏసిబికి పట్టుబడడంతో.. గాజువాక పోలీస్ స్టేషన్లో సిబ్బంది ఉలిక్కిపడ్డారు. అవినీతి అధికారులపై ప్రజలు ఫిర్యాదు కోసం 14400 అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. 14400 నెంబరును ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని, ఎవరైనా అధికారులు వేధింపులకు పాల్పడితే ప్రజలు పై నెంబర్ ద్వారా అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించవచ్చని డిజిపి రాజేంద్రనాధ్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..