యూత్ కు సెల్ఫీలంటే ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. సమయం, సందర్భం ఏదైనా.. సెల్ఫీలు తీసుకోవడం, వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం, లైకులు, కామెంట్ల కోసం వెంపర్లాడడం కామన్. అయితే ఈ సెల్ఫీలు చాలా వరకు బాగానే ఉంటాయి. కానీ ఒక్కసారి లిమిట్ క్రాస్ అయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సెల్ఫీలు దిగుతూ ప్రమాదాల బారిన పడి, ప్రాణాలు కోల్పోయిన వారు చాలా మందే ఉన్నారు. అయినా మార్పు రావడం లేదు. తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. కారు నడుపుతూ సెల్ఫీలు తీసుకున్నారు. దీంతో కారు అదుపుతప్పి జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తణుకు పట్టణానికి చెందిన సయ్యన్ హుస్సేన్, అతని స్నేహితులు ఫణేంద్ర, శశికిరణ్ లు సరదాగా కారును డ్రైవ్ చేసుకుంటూ రోడ్డు మీదకు వచ్చారు. అత్యుత్సాహంతో స్టీరింగ్ వదిలేసి మరీ సెల్ఫీలు తీసుకున్నారు. ఇంకే ముంది.. కారు డైరెక్ట్ గా జనాల పైకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. రోడ్డు పై ప్రయాణించే వారు, దుకాణాలు నిర్వహించుకునే వారు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో వీరబాబు, శ్రీను, అతని కుమార్తె నాగసత్య దుర్గా భవానీలకు తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే అలర్ట్ అయిన స్థానికులు చికిత్స కోసం వారిని 108 లో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వీరబాబు మృతి చెందాడు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో సయ్యన్ హుస్సేన్ కారు నడుపుతున్నట్లు స్థానికులు గుర్తించారు. కాగా.. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో ముగ్గురు యువకులు సురక్షితంగా బయటపడ్డారు. సయ్యన్ హుస్సేన్ అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.
యువకులు రాష్ డ్రైవింగ్ తోనే యాక్సిడెంట్ జరిగిందని ఫిర్యాదు అందుకున్నారు. ఫణీంద్ర, శశికిరణ్‌లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు.. పని నిమత్తం వచ్చిన వీరబాబు ఊహించని ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి