Andhra Pradesh: చెరువుపై చిన్ననాటి మమకారం.. రూపురేఖలు మార్చేలా చేసింది.. !

| Edited By: Balaraju Goud

Aug 27, 2024 | 8:33 PM

ఆ చెరువు పక్కకు వెళ్లాలంటే ముక్కు మూసుకోవాల్సిందే..! గత ముప్పై ఏళ్లుగా అదే పరిస్థితి..! ఇంట్లో చెత్త నుండి జంతు కళేబరాలకు వరకూ డంపింగ్ బిన్ ఆ చెరువే..! అయితే ఒక సామాన్యుడి ఆవేదన దాని రూపు రేఖలు మార్చేసింది.

Andhra Pradesh: చెరువుపై చిన్ననాటి మమకారం.. రూపురేఖలు మార్చేలా చేసింది.. !
Guntur R Agraharam Pushkarini
Follow us on

ఆ చెరువు పక్కకు వెళ్లాలంటే ముక్కు మూసుకోవాల్సిందే..! గత ముప్పై ఏళ్లుగా అదే పరిస్థితి..! ఇంట్లో చెత్త నుండి జంతు కళేబరాలకు వరకూ డంపింగ్ బిన్ ఆ చెరువే..! అయితే ఒక సామాన్యుడి ఆవేదన దాని రూపు రేఖలు మార్చేసింది. మురికి కూపం నుండి సుందర తటాకంగా మార్పు చెందింది. అది చెరువంటే చెరువు కాదు. పుష్కరిణి..! రెండు దేవాలయాలకు చెందిన తెప్పోత్సవాలు నిర్వహించే అరుదైన కోనేరు.. గుంటూరుకు అవసరమైన తాగునీటిని ఒకప్పుడు ఇక్కడే డ్రమ్ముల్లో తరలించుకుపోయేవారు. ఈ చెరువు పుట్టుకకు ఒక కథ ఉంది.

1896లో జిల్లా న్యాయమూర్తిగా ఉన్న కేతంరాజు జగన్నాధ పంతులు ఖైదీల్లో పరివర్తన తీసుకొచ్చే పనిలో భాగంగా గుంటూరు ఆర్ అగ్రహారంలో పుష్కరిణిని తవ్వించారు. ఆ తర్వాత గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి ఆలయం, కాళీయమర్ధన స్వామి ఆలయాల స్వామివార్ల తెప్పొత్సవాలు ఈ కోనేరులోనే నిర్వహించేవారు. ఆలయాల్లో నిత్య పూజలు, అభిషేకాలను ఈ నీటినే ఉపయోగించేవారు. స్వాతంత్ర్య సంగ్రామంలో అనేక ఉద్యమాలకు ఈ కోనేరునే కొండా వెంకటప్పయ్య పంతులు వేదికగా చేసుకున్నారు. ఎంతో మంది ఉద్యమకారులకు ఇక్కడ కంకణధారణ చేసేవారు. అయితే ఇదంతా చరిత్ర..

గత ముప్పై ఏళ్ల నుండి ఈ కోనేరు తన ప్రాభవాన్ని కోల్పోయింది. నగరం విస్తరించే కొద్దీ కోనేరు కుంచించుకుపోయింది. అయితే కొద్దీ రోజుల క్రితం ఈ చెరువు వద్దకు వచ్చి చూసిన స్థానికుడు మంజునాథ్ చలించిపోయారు. చిన్నతనంలో కోనేరు గట్టుపై ఆడుకున్న గుర్తులు నెమరేసుకున్నారు. దీంతో చెరువును శుభ్రం చేసేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే తనకు అందివచ్చిన పరికరాలతో చెరువు శుద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అగ్రహారంలోని పుష్కరిణికి పూర్వ రూపం తీసుకురావాలని సంకల్పించారు.

స్వంతంగా ట్యూబ్‌లు ఉపయోగించి పడవ తయారు చేసుకున్నారు. రెండు లక్షల రూపాయల ఖర్చుతో చెత్తా చెదారం తొలగించడం మొదలు పెట్టారు. గుర్రపు డెక్కా, ప్లాస్టిక్ వ్యర్ధాలను ఒక క్రమ పద్దతిలో తొలగించుకుంటూ వచ్చారు. అంతేకాదు కోనేరు గట్టు చుట్టూ మొక్కలు నాటారు. నీటి తొట్లు ఏర్పాటు చేశారు. కోనేరు రూపురేఖలు ఒక్కసారిగా మారిపోవడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం కంపుతో నిండిన చెరువు అహ్లాదంగా మారడంతో సాయంత్ర వేళ సరదా గడిపేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. చెరువుతో చిన్ననాడు పెనవేసుకున్న బంధాన్ని మర్చిపోలేక స్వయంగా సుందరీకరణ చేసేందుకు రంగంలోకి దిగినట్లు మంజునాథ్ తెలిపారు. ఇలా సంకల్పంతో సాగుతున్న మంజునాథ్‌పై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..