ఆంధ్రప్రదేశ్‌లో దారుణ హత్య జరిగింది. తండ్రి సోదరుడే విలన్లుగా మారి.. సుఫారీ ఇచ్చి దారుణంగా హత్య చేయించారు. ఆపై ఏమీ తెలియనట్టు నటించారు. చివరకు అసలు విషయం బయటపడడంతో.. నిందితులంతా కటకటాల వెనక్కి వెళ్లారు. అనకాపల్లి జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
మే నెల 23న మాడుగుల పోలీస్ స్టేషన్‌లో ఒక మిస్సింగ్ కేసు నమోదు అయింది. తన భర్త రామాంజనేయులు మే నెల 21వ తేదీ నుంచి కనిపించడం లేదంటూ సేనాపతి శ్రీదేవి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న క్రమంలో.. యలమంచిలి కొక్కిరాపల్లి చెరువులో మే 24న గుర్తు తెలియని మృతదేహం కనిపించింది. దీంతో స్పాట్‌కు చేరుకుని ఆ మృతదేహం తన భర్తదేనని శ్రీదేవి గుర్తు పట్టడంతో పోస్టుమార్టం నిర్వహించారు. హత్యగా ఫోరెన్సిక్ నివేదికలో రావడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేశారు.
కేసును సీరియస్‌గా తీసుకున్న జిల్లా ఎస్పీ హరికృష్ణ 5 బృందాలను రంగాల్లోకి దింపారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చివరికి కుటుంబ సభ్యులే యువకుడిని అత్యంత దారుణంగా హత్య చేయించారని పోలీసుల దాదాపుగా నిర్ధారణకు వచ్చారు. ఈ క్రమంలోనే మృతుడి తండ్రి నాగరాజు, తమ్ముడు శివాజీ తోపాటు సతీష్ అనే మరో వ్యక్తి వీఆర్వో సమక్షంలో పోలీసుల ఎదుట లొంగిపోయారు. తామే రామాంజనేయులును హత్య చేశామని ఒప్పుకున్నారు. దీంతో మిస్సింగ్ కేసు మర్డర్ కేసుగా మారింది. కన్న తండ్రే నిందితుడుగా మారడంతో అంతా షాక్ అయ్యారు.
హత్యకు గల కారణాలపై ఆరా తీసిన పోలీసులకు షాకింగ్ ఫ్యాక్ట్స్ బయటపడ్డాయి. మృతుడి తల్లిదండ్రులు సోదరుడు మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రామాంజనేయులు తండ్రి ఇచ్చిన ఆరు లక్షల రూపాయలతో కోటపాడు వద్ద రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. ఇచ్చిన డబ్బులు సరిపోకపోవడంతో మరింత డబ్బులు ఇవ్వాలని, ఆస్తులు పంచాలంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొచ్చాడు. సోదరులతో సహా అందరిని డబ్బుల కోసం హింసించాడు. దీంతో అతని ప్రవర్తలతో విసిగిపోయిన కుటుంబ సభ్యులు, ఎలాగైనా హతమార్చాలని అనుకున్నారు. ఇందు కోసం కిరాయి హంతకులు అంజిరెడ్డి, నాగేంద్రబాబు, మురళీకృష్ణ, శివతో ఒప్పందం కుదుర్చుకున్నారు. రామాంజనేయులు హతమార్చడానికి సుపారీ ఇచ్చారు.
దీంతో రామాంజనేయులు కదలికను గుర్తించిన ఆ నలుగురు.. మే 21వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు విందుకు తీసుకెళ్లి మద్యం తాగించారు. వడ్డాదిలో దింపుతామని కారులో ఎక్కించుకుని, మార్గమంచలో కత్తితో పొడిచి హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని ఎలమంచిలి మండలం ఇంకొకరపల్లి వద్ద ట్యాంకులో పడేసి పారిపోయారు. రామాంజనేయులును హతమార్చేందుకు మృతుడి తండ్రి నిందితులకు ఆరు లక్షల రూపాయలు సుపారీ ఇచ్చాడని జిల్లా ఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. దీంతో పోలీసులు లొంగిపోయిన ముగ్గురితో పాటు.. హత్య చేసిన మరో నలుగురు కూడా అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టామని ఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి కారు, 23 గ్రాముల బంగారం, 6 సెల్ ఫోన్లు, కత్తి స్వాదీనం చేసుకున్నామని ఎస్పీ మురళీ కృష్ణ వెల్లడించారు.
ఎట్టకేలకు మర్డర్ కేసు మిస్టరీ వీడింది. ప్రతి కుటుంబంలో వివాదాలు సర్వసాధారణం. కానీ ఇంతలా కుటుంబ సభ్యులే సుపారీ ఇచ్చి హత్య చేయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..