Car plunges into canal in Guntur: ఏపీలోని గుంటూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లా దుర్గి మండలం అడిగొప్పల సమీపంలోని సాగర్ కుడి కాలువలోకి మంగళవారం రాత్రి ప్రమాదవశాత్తు కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బుంధువులు ఇద్దరు మరణించారు. ఈ ఘటనలో పిన్నెల్లి బాబాయి సుందరరామిరెడ్డి కుమారుడు మదన్‌మోహనరెడ్డి క్షేమంగా బయటపడగా, ఆయన భార్య లావణ్య, కూతురు సుదీక్ష చనిపోయారు. సంక్రాంతి నేపథ్యంలో దుస్తుల కొనుగోలుకు మదన్‌మోహనరెడ్డి భార్య, కుమార్తెతో కలిసి ఉదయం విజయవాడ వెళ్లారు. ఈ క్రమంలో రాత్రి ఇంటికి తిరిగొస్తుండగా.. అడిగొప్పల దాటాక ఈ ఘటన చోటుచేసుకుంది.
ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించే ప్రయత్నంలో కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. అయితే కారు నడుపుతున్న మదన్‌మోహనరెడ్డి అతికష్టం మీద బయటకు రాగలిగారు. నీటి ప్రవాహానికి కారు కొట్టుకుపోయింది. సమాచారం అందుకున్న ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారు కోసం రాత్రి నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. బుగ్గవాగు రిజర్వాయర్ వద్ద నీరు దిగువకు వెళ్లకుండా నిలిపేశారు.
దీంతో బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో భారీ క్రేన్ సహాయంతో కారును కాలువ నుంచి బయటికి తీసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో కారులో లావణ్య, చిన్నారి సుదీక్ష మృతదేహాలు బయటపడినట్లు తెలిపారు. ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంఘటనా స్థలంలో ఉండి పర్యవేక్షించారు.
Also Read: