వేసవి సెలవులు వచ్చేశాయ్. దీంతో మొన్నటి వరకు పుస్తకాలతో కుస్తీలు పడ్డ చిన్నారులు హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంట్లో ఖాళీగా ఉండే చిన్నారులకు ఏదో ఒక హాబీ నేర్పించాలని పేరెంట్స్ సమ్మర్ క్యాంప్స్‌కు పంపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈత నేర్పించడానికి స్విమ్మింగ్ పూల్స్‌కి సైతం పంపిస్తుంటారు. అయితే ఈ సరదా వెనకాల విషాదం కూడా పొంచి ఉంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా భారీ మూల్యం చెల్లించకతప్పదు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని అనకాలపల్లిలో జరిగిన దారుణ సంఘటన ఉలిక్కిపడేలా చేసింది.
వివరాల్లోకి వెళితే.. స్విమ్మింగ్ పూల్ సరదా చిన్నారుల ప్రాణాలు తీసేస్తున్నాయి. అనకాపల్లి జిల్లాలో మూడు వారాల గ్యాప్‌లో ఇద్దరు చిన్నారులు బలయ్యారు. తల్లితండ్రుల కళ్ళముందే ఓ చిన్నారిని స్విమ్మింగ్ పూల్ మింగేసింది. వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం వెళితే ప్రాణాలే పోతున్నాయ్. అనకాపల్లి జిల్లాలో స్విమ్మింగ్ పూల్‌లో పడి మృతిచెందిన పవన్‌కుమార్ అంత్యక్రియలు ముగిశాయి. మునగపాక మండలం అరబ్బుపాలెంకు చెందిన గంగునాయుడు, మాధురి దంపతులు ఇద్దరి పిల్లల్ని తీసుకుని సమ్మర్‌లో రిలీఫ్ కోసం స్విమ్మింగ్ పూల్‌కి వెళ్లారు. ఇద్దరు పిల్లల్ని తండ్రి పూల్ వాటర్‌లో ఆడిస్తుంటే… తల్లి ఫోటో తీస్తోంది. చిన్నపాటి ఏమరుపాటుతో చిన్న పిల్లాడు చరణ్ మునిగిపోయాడు… వాడ్ని పట్టుకుని అన్న పవన్‌కుమార్ కూడా మునిగిపోయాడు. తేరుకుని… చరణ్‌ని కాపాడగలిగారు. కానీ.. అపస్మారక స్థితిలోకి చేరిన పవన్ కుమార్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది.
సరదాగా స్విమ్మింగ్ పూల్‌కు వెళ్లిన తల్లిదండ్రులు క్షణాల్లో కుమారుడిని కోల్పోయారు. దాంతో.. కన్నీరు మున్నీరుగా విలపించారు. చిన్నారి మృతితో గ్రామంలోనూ విషాదఛాయలు అలముకున్నాయి. పోస్టుమార్టం తర్వాత అరబ్బుపాలెంలో చిన్నారి పవన్‌కుమార్ అంత్యక్రియలు నిర్వహించారు. ప్రస్తుతానికి యాక్సిడెంటల్ డెత్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. అన్ని వివరాలు సేకరించి.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు అనకాపల్లి సీఐ రవికుమార్. ఘటన తర్వాత పూల్‌ని తాత్కాలికంగా మూసేసి పరారయ్యారు నిర్వాహకులు. అదేసమయంలో.. కనీస పర్యవేక్షణ లేకపోవడం, లోతు అంచనా వేయలేకపోవడంతోనే చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా.. సరదా కోసం స్విమ్మింగ్ పూల్స్‌కు వెళ్తున్న చిన్నారులు, తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నారు నిపుణులు. కొద్దిపాటి నిర్లక్ష్యాలే.. ప్రమాదాలకు కారణం అవుతాయంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..