అమరావతి, అక్టోబర్ 16: బడిఈడు పిల్లలంతా బడిలోనే ఉండాలి.. పదో తరగతి తర్వాత కూడా చదువు మానేయకూడదు.. అంతేకాదు టెన్త్ ఫెయిలైనా స్కూళ్లోనే ఉండాలంటూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పేర్కొంటున్నారు. అందుకే ఈసారి కొత్త నిబంధన అమల్లోకి తెచ్చింది ఏపీ సర్కార్.. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులు.. ఇంటర్మీడియట్ ఫెయిలైన విద్యార్ధులు.. తిరిగి పాఠశాల లేదా కాలేజీలో చేరే అవకాశాన్ని కల్పించింది. టెన్త్, ఇంటర్‌లో రీఅడ్మిషన్ విధానం ద్వారా విద్యార్ధులకు మరోసారి చదువుకునే అవకాశాన్ని కల్పించింది. గతేడాది వరకూ పదో తరగతి ఫెయిలైన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షల్లో లేదా ఆ తర్వాత సంవత్సరం మళ్లీ పరీక్షలు రాయాల్సి వచ్చేది. ఒకసారి టెన్త్ చదివిన విద్యార్థులు మళ్లీ బడిలోకి వెళ్లి చదువుకునే అవకాశం ఉండేది కాదు. దీని ద్వారా ఒకసారి ఫెయిలైన విద్యార్థులకు సరైన శిక్షణ లేక ఇబ్బంది పడేవారు. అయితే గతేడాది టెన్త్‌లో ఫెయిలైన విద్యార్ధులను ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో రీఅడ్మిషన్ కల్పిస్తూ జగన్ సర్కార్ మరోసారి చదువుకునేందుకు అవకాశమిచ్చింది. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, వాలంటీర్ల ద్వారా పదో తరగతి ఫెయిలైన విద్యార్ధులను గుర్తించి తిరిగి పాఠశాలల్లో చేర్పించింది. కేవలం పదో తరగతి మాత్రమే కాదు.. ఇంటర్‌లోనూ ఇదే విధానాన్ని ఫాలో అయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టి.. సఫలికృతమైంది.
పదోతరగతి ఫెయిలైన విద్యార్ధులు చాలా మంది చదువు మానేయడాన్ని ప్రభుత్వం గుర్తించింది. అందుకే ఇలాంటి పరిస్థితిని మార్చాలని నిర్ణయించింది. ప్రతి విద్యార్ధి కనీసం డిగ్రీ వరకూ చదవాలనే ఉద్దేశంతో దానికి తగ్గట్లుగా విద్యార్ధుల కోసం అనేక రకాల పథకాలు అమలుచేస్తోంది ప్రభుత్వం.. ఈసారి ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల పదో తరగతిలో కొత్తగా లక్షా 26 వేల 212 మంది విద్యార్థులు చేరారు. గతేడాది టెన్త్ పరీక్షల్లో లక్షా 23 వేల 680 మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. వీరిని తిరిగి పాఠశాలల్లో చేర్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మొత్తం లక్షా 23 వేల 680 మందిలో 88 వేల 342 మంది ఫెయిలైన విద్యార్థులకు తిరిగి టెన్త్ క్లాస్‌లో అడ్మిషన్లు ఇప్పించారు. ఈ విద్యార్థులంతా ప్రస్తుతం రెగ్యులర్ విద్యార్థులతో పాటు స్కూల్స్‌కు హాజరవుతున్నారు. మొత్తంగా గతేడాది టెన్త్‌లో 6 లక్షల 64వేల 511 మంది విద్యార్థులుంటే ఈ ఏడాది 7 లక్షల 90 వేల 723 మంది ఉన్నారు. ఇలా టెన్త్ ఫెయిలయ్యి తిరిగి రీఅడ్మిషన్ తీసుకున్న వారిలో అనంతపురం జిల్లా నుంచి ఎక్కువగా 9వేల 112 మంది ఉన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా నుంచి 482 మంది తిరిగి టెన్త్‌లో ఎన్‌రోల్ అయ్యారు. ఇలా ఇంటర్ లో కూడా చాలామంది విద్యార్థులకు రీఅడ్మిషన్ కల్పించినట్లు ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.
పదో తరగతి, ఇంటర్ ఫెయిలై తిరిగి రీఅడ్మిషన్ పొందిన వారికి అనేక అవకాశాలు కల్పిస్తుంది ప్రభుత్వం.. ఆయా విద్యార్థులు అన్ని సబ్జెక్టులను తిరిగి రాయవచ్చు. ఎప్పుడు ఎక్కువ మార్కులు వస్తే అప్పటి మార్కులను సర్టిఫికెట్లలో పరిగణనలోకి తీసుకుంటారు. ఇక సర్టిఫికెట్లపై రెగ్యులర్ లేదా సప్లిమెంటరీ అని కూడా ముద్రించరు. అంతేకాదు అమ్మఒడితో పాటు ఇతర పథకాలకు అన్నింటికీ రీ అడ్మిషన్ పొందిన విద్యార్ధులు అర్హులు. అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన పథకాలకు కూడా ప్రభుత్వం అర్హత కల్పిస్తుంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..